MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, నవంబర్ 21: కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రహదారి పునరుద్ధరణకు అవసరమైన నిధులను సమీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం రహదారి మరమత్తు పనుల కోసం మున్సిపల్ నిధులు రూ.5 లక్షలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ, రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణకు సాంకేతిక పరమైన నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్, డీఈ సత్యనారాయణ, ఏఈలు లక్ష్మీకాంత్, పైజాన్, మున్సిపల్ అధికారులు రమ్య, సురేష్, అశోక్, బీఆర్ఎస్ నాయకులు పహిమ్, మోహన్ రెడ్డి, సందయ్య, అతీక్, గంగాధర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.