పెద్దపల్లి, మార్చి18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్కసు.. కాళేశ్వరంపై కుట్రతో ప్రాజెక్టును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్‌కు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శాపనార్థాలు పెట్టారు. ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదని చెప్పారు. రైతుల కన్నీళ్లకు కారణమైన కాంగ్రెస్‌కు, రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సరార్కు ఆ శాపం తప్పక తగులుతుందన్నారు. గోదావరి తల్లి కన్నీటి గోసను కండ్లగడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను వివరిస్తూ, కాంగ్రెస్ సరారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ చేపట్టిన మహా పాదయాత్ర రెండో రోజు మంగళవారం ఉదయం పెద్దపల్లిలోని బంధంపల్లి స్వరూప గార్డెన్స్ నుంచి ప్రారంభమైంది.
30కిలోమీటర్లు నడిచి రాత్రి వరకు కరీంనగర్ చేరుకున్నది. కేఎస్ఎల్ గార్డెన్స్‌లో బస చేసింది. పెద్దపల్లిలో బృందానికి పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉష, రఘువీర్‌సింగ్, గంట రాములు, పూదరి చంద్రశేఖర్, పస్తం హన్మంతు, పూదరి చంద్రశేఖర్, భిక్షపతి, పెద్ది వెంకటేశ్, తబ్రేజ్ పూల మాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల చందర్ మాట్లాడారు. అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని, సాధ్యంకాని హామీలతో ప్రజలను నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. పాలన చేతకాక రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు నీటికోసం తండ్లాడలేదని, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో నీటికోసం అరిగోస పడుతున్నామని వాపోయారు. గోదావరిని ఎండబెట్టడంతో ఇరువైపులా సాగు, తాగునీటికి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జంతు జీవాలు, పశుపక్ష్యాదులు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఊరికే పోదని, గోదావరిని ఎండబెట్టిన ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాళేశ్వరం సేఫ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారని, సేఫ్‌గా ఉంటే గోదావరిని ఎందుకు ఎండబెట్టారని నిలదీశారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లకు ఎందుకు మరమ్మతు చేయడం లేదో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వెంటనే నీళ్లను ఆపి రివర్స్ పంపింగ్ చేసి నదిని నిండుకుండలా మార్చాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి
కాంగ్రెస్ పాలనలో సాగు, తాగు నీళ్లు లేక రైతులు, ప్రజలు అల్లాడుతున్నరు. కన్నీటి కష్టాలను దూరం చేసేందుకే గోదావరి తల్లి కన్నీటి గోస మహాపాదయాత్రకు బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ శ్రీకారం చుట్టిండు. తెలంగాణ ప్రాంతాన్ని కాంగ్రెస్ నిలువునా ముంచుతున్నదనే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి కాళేశ్వరం బ్యారేజీలను నింపి సాగు, తాగునీరును ఇవ్వాలి.
– దాసరి ఉష, బీఆర్ఎస్ నాయకురాలు (పెద్దపల్లి)