గోదావరిఖని, ఆగస్టు 30: అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. శనివారం గోదావరిఖనిలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. శుక్రవారం గోదావరిఖనిలోని బీఆర్ఎస్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా మ్యానిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలుచేయలేదో చెప్పాలని నిలదీశారు.
రైతుభరోసా కోసం రైతులు, పింఛన్ల కోసం వృద్ధులు, ప్రతినెలా రూ. 2500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గనికార్మికుల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి వందలకోట్లు వెచ్చించారని పేర్కొన్నారు. తాను పారిశ్రామిక ప్రాంత ప్రగతి కోసం నవ నిర్మాణ సభ ఏర్పాటు చేసి అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ద్వారా 30 ఐటీ పార్కు అంతర్గాంలో వంద ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కులకు శంకుస్థాపన చేయించానని గుర్తుచేశారు.
కాంగ్రెస్ సర్కారు గతంలో మంజూరైన నిధులతో పనులను పూర్తి చేయాలని కోరారు. రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు సంతోషకరమని, అయితే జెన్కో ద్వారానే నిర్మాణం చేపట్టి స్థానిక యువతకు ఉద్యోగవకాశాలు కల్పించాలన్నారు. తిలక్‌నగర్‌లో నిరుపయోగంగా ఉన్న స్కూల్ భవన్నాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు గాధం విజయ, బొడ్డు రవీందర్, పిల్లి రమేశ్, చల్లగురుగుల మొగిళి, నూతి తిరుపతి, తోకల రమేశ్, సట్టు శ్రీనివాస్, గుంపుల లక్ష్మి, యాసర్ల తిమోతి, కోడి రామకృష్ణ, కిరణ్, కనకరాజ్, వెంకటేశ్, రామరాజు, తిరుమల ఉన్నారు.