కరీంనగర్ కార్పొరేషన్, జూలై 12 : రాష్ట్రంలో కరువు పరిస్థితులు భయపెడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌పై అక్కసుతో రైతులపై కక్ష చూపుతున్నాడని, సాగునీర్వికుండా గోస పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. పంటలకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే.. నాయకులను కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయని ఒక సీఎం స్థాయిలో ఉండి ఎలా మాట్లాడుతారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత కరశంగా, దుర్మార్గంగా మాట్లాడిన సీఎంను తామెప్పుడూ చూడలేదని మండిపడ్డారు. నీళ్లివ్వాలని సలహా ఇచ్చిన రిటైర్డ్ ఇంజినీర్లను బొకలో వేయాలని వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వాఖ్యలను ఉపసంహరించుకొని వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణకు ఆయువుపట్టులాంటి కాళేశ్వరంపై విషప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వాయర్లలో నీళ్లు లేవని, ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీకి చేరాయని, దురదృష్టవశాత్తు వర్షాలు పడకపోతే రానున్న రోజుల్లో సాగునీటికే కాదు, తాగునీటికి సైతం ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం ఇష్టాయిష్టాల కంటే రైతుల పరిస్థితి ముఖ్యమని, కక్షసాధింపు మానుకొని వెంటనే కన్నెపల్లి మోటర్లను ఆన్‌చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు పంటలు వేయాలా.. వద్దా..? అనే సందిగ్ధంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా రైతులకు నీటి భరోసా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా ఇరిగేషన్ శాఖలో పనిచేసి, రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న రిటైర్డ్ ఇంజినీర్లు కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ప్రారంభించాలని సలహా ఇస్తే గౌరవించాల్సిందిపోయి, వారిని జైలుకు పంపాలంటూ సీఎం మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. బాధ్యతగల ప్రభుత్వం అయితే నీటిని ఎత్తిపోసే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి సంబంధిత అధికారులతో వివరణ ఇప్పించాలని గానీ, సలహాలు ఇచ్చిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఆగ్రహించారు.
ప్రస్తుతం గోదావరిలో దాదాపు 98 టీఎంసీల నీరు వృథాగా పోతున్నదని, మేడిగడ్డ దగ్గర గేట్లు వేయకుండా అకడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని పంప్ చేయవచ్చని తెలిపారు. దీని ద్వారా ఎల్లంపల్లి, మానేరు వంటి రిజర్వాయర్లకు నీటిని తరలించి రైతులకు ప్రయోజనం చేకూర్చవచ్చని చెప్పారు. అయితే ఇప్పుడు నీటిని ఎత్తిపోస్తే గతంలో తాము చేసిన ఆరోపణలు అసత్యమని తేలిపోతాయనే ఉద్దేశంతోనే పంపులను ప్రారంభించడం లేదని దుయ్యబట్టారు. ఎన్ఎస్డీఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు మరమ్మతులు చేయవచ్చని, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కూడా మరమ్మతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. 30 నెలలుగా ఎందుకు మరమ్మతులు చేయడం నిలదీశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, బీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాంరెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.