ధర్మారం, మే 24: వరి, మకల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఓ వైపు కాంటా వేయడంలో జాప్యం చేస్తూ, మరోవైపు తరుగు పేరిట అదనపు తూకం వేస్తూ రైతును నిండా ముంచుతున్నారని, వెంటనే దోపిడీని ఆపాలని డిమాండ్ చేశారు. క్వింటాల్‌కు 7 నుంచి 8 కిలోల తరుగు తీస్తూ మోసం చేస్తున్నారని, ఫలితంగా ఒకో లారీ లోడ్‌కు రైతులు రూ.9 వేల దాకా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. సెంటర్లలో రైతులకు జరుగుతున్న దోపిడీని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కేంద్రాలకు వచ్చే దమ్ము ధైర్యం మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు ఉన్నదా..? కటింగ్ లేకుండా కొంటున్నామని ధర్మపురి నృసింహుడి క్షేత్రంలో ప్రమాణం చేస్తారా..? అని సవాల్ విసిరారు.
రైతులకు మద్దతుగా ఆదివారం ధర్మారంలోని కరీంనగర్ – రాయపట్నం రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయగా, కొప్పుల హాజరయ్యారు. ధాన్యం రోడ్డుమీద పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొన్నామని గుర్తు చేశారు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఇప్పటివరకు సగం కూడా కొనుగోలు చేయలేదని దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లాకు ఇన్చార్జిగా ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ కొనుగోళ్లలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రతి చిన్న విషయానికి రైతులను పకదారి పట్టించి ఆందోళన చేశారని, ధాన్యం కటింగ్ చేసిన సొమ్ము ఏమవుతుందని పదే పదే ప్రశ్నించేవారని, మరి ఇప్పుడు కటింగ్ అవుతున్న 7, 8 కిలోల ధాన్యం సొమ్ము లక్ష్మణ్ కుమార్ జేబులోకి వెళ్తుందా..? అని ప్రశ్నించారు. దీనికి రైతులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో కొనుగోళ్ల విషయంలో తీవ్ర జాప్యం జరిగి రైతులకు నష్టం వాటిల్లుతున్నదని, ఇక జగిత్యాల విషయానికి వస్తే కటింగ్ పేరిట విపరీతమైన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
లక్ష్మణ్ కుమార్ ఇంట్లో ఉండి అంతా బాగానే ఉందని ప్రకటిస్తే చాలదని, కొనుగోలు కేంద్రాలకు వచ్చి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. కొనుగోళ్ల విషయంలో లక్ష్మణ్‌కుమార్‌కు అసలు ఎలాంటి అవగాహన లేదని, రాష్ట్రంలోనే అట్టర్ ఫ్లాప్ మంత్రి అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అది చేస్తాం.. ఇది చేస్తామని చేయని వాగ్దానం లేదని, అబద్ధాలకు కేరాఫ్ అడ్లూరి అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో సెటిల్మెంట్లు చేయడం కాదని, ఇకడి రైతుల కష్టాలు తీర్చడంపై శ్రద్ధచూపాలని హితవు పలికారు.
ఇకనైనా ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని వెనువెంటనే కొనాలని, లేదంటే రైతుల తరఫున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ తాజా మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచులు మోతే కనకయ్య, మంద శ్రీనివాస్, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, నాయకులు పూసు రు రామారావు, పాకాల రాజయ్య, తుమ్మల రాంబాబు, మిట్ట తిరుపతి, నాడెం శ్రీనివాస్, నేరెళ్ల చిన్న లచ్చయ్య, కూరపాటి శ్రీనివాస్, ఎగ్గేల స్వామి, దొనికేని తిరుపతి, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, రెడపాక శ్రీనివాస్, గుజ్జేటి కనకలక్ష్మి, కాంపల్లి అపర్ణ, దేవి రేణుక, మార సంధ్య పాల్గొన్నారు.