సంగారెడ్డి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఇకపై మాజీ మంత్రి హరీశ్‌రావుపై అవాకులు, చవాకులు పేలితే సహించేదిలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు. మంగళవారం సంగారెడ్డిలోపి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు పొందేందుకు పదే పదే జగ్గారెడ్డి హరీశ్‌రావుపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. భార్య నిర్మల కార్పొరేషన్ పదవి రెన్యూవల్ చేసుకునేందుకు జగ్గారెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సంగారెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి ప్రభుత్వ పదవులు లేని తనకు, తన భార్య నిర్మలకు వేదికపై చోటు దక్కదన్న అసంతృప్తితోనే హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగ్గారెడ్డి ఖబడ్దార్.. నీ రాజకీయలాభం కోసం హరీశ్‌రావుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంగారెడ్డి ప్రజలు తిరస్కరించినా జగ్గారెడ్డిలో ఇంకా పదవీకాంక్ష పోలేదని చింతా ప్రభాకర్ మండిపడ్డారు. సోనియా, రాహుల్‌గాంధీ వచ్చినా వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలుపు సాధ్యం కాదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని రాజకీయంగా బొందపెట్టడం ఖాయమని తెలిపారు. రాహుల్ సభ కోసం రూ.6కోట్లు అప్పు చేశానని జగ్గారెడ్డి పదేపదే చెప్పుకోసం సిగ్గుచేటన్నారు. జగ్గారెడ్డిపై మానవ అక్రమరవాణా కేసు నమోదు, అరెస్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మానవ అక్రమరవాణా కేసు నమోదైందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చట్టం ప్రకారం జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు తప్ప, అందులో బీఆర్ఎస్, హరీశ్‌రావు కుట్ర ఏమీలేదన్నారు. మానవ అక్రమరవాణా కేసులు జైలుకు వెళ్తే, తిరిగి వచ్చి తనకు ప్రాణభయం ఉంది ఎమ్మెల్యేగా గెలిపించి ప్రాణభిక్ష పెట్టాలంటూ ఓటర్లను వేడుకుంటే జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏనాడూ ప్రజలకు అందుబాటులో ఉండలేదని, సంగారెడ్డి అభివృద్ధి గురించి ఆయన ఆలోచించలేదని చింతా ప్రభాకర్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సహకారంతో తాను సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి చేశామని తెలిపారు.
అందుకే ప్రజలు తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపించినట్లు చెప్పారు. కేసీఆర్ వల్లే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ కోసం ఫైల్ పెట్టానని చెప్పుకునే జగ్గారెడ్డి, అప్పుడే ఎందుకు మెడికల్ కాలేజీ మంజూరు చేయించలేకపోయారో సంగారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ సంగారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సమక్యైవాదానికి మద్దతుగా నిలిచిన జగ్గారెడ్డి, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగ్గారెడ్డికి దమ్ముంటే తెలంగాణ ఉద్యమం, సంగారెడ్డి అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యేగా తాను నిరంతరం సంగారెడ్డి అభివృద్ది కోసం పనిచేస్తానని, ప్రజల నిత్యం అందుబాటులో ఉంటానని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ట్లో చేరేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావును కలిశారని, ఆ విషయాన్ని జగ్గారెడ్డి మర్చిపోవటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా నేత కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు డాక్టర్ శ్రీహరి, జైపాల్‌రెడ్డి, నరహరిరెడ్డి, కొండల్‌రెడ్డి, జొన్న రాజేందర్‌రెడ్డి, లాడే మల్లేశం, శ్రావణ్‌రెడ్డి, విష్ణు, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.