పెగడపల్లి, ఏప్రిల్ 26 : ఈ నెల 27న ఎల్కతుర్తిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించే రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో శనివారం పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 1500 ఎకరాల విస్తీర్ణంలో రజతోత్సవ బహిరంగ సభ జరుగుతుందని, లక్షలాది మంది తరలి వచ్చే ఈ సభ ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప సభ కానుందని వివరించారు. రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు హాజరు కానున్నారని తెలిపారు. ఒక్క ధర్మపురి నియోజకవర్గం నుంచే 10 వేల మంది వరకు హాజరవుతారని ఈశ్వర్ వివరించారు.
ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని, బహిరంగ సభకు వచ్చే వారంతా జాగ్రత్తగా వచ్చి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, నర్సింహారెడ్డి, లక్ష్మణ్, కరుణాకర్‌రావు, స్వామి, గంగాధర్, తిరుపతి, పెద్ది రమేశ్, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సుధాకర్, వీరేశం, శంకర్, శాంతపురావు, రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.