పెద్దపల్లి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, స్కీంలకు గండి కొట్టి.. స్కాంలను ప్రోత్సహిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తున్నదని, అన్ని వర్గాలనూ మోసం చేసేలా ఉన్నదని ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని పురోగమనాన్ని కాంగ్రెస్ 28 నెలల్లో పూర్తిగా తిరోగమనంలోకి నెట్టిందని ఆగ్రహించారు. పెద్దపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కొప్పుల మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఈ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదని, 28 నెలల్లో 3 లక్షల 47వేల కోట్ల అప్పు చేశారని, అయినా ఒక్క పెద్ద ప్రాజెక్టును కూడా నిర్మించలేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3,24,234 కోట్ల బడ్జెట్ అంకెల గారడీనేనని విమర్శించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల రాబడి 1,11,798 కోట్లు వచ్చినట్టు గత బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొన్నదని, 2024-25 సంవత్సరానికి 1,09,233 కోట్లు వచ్చినట్టు తాజా బడ్జెట్లో ప్రకటించిందన్నారు.
అంటే, ఏడాదిలో రాష్ట్ర ఆదాయం పడిపోయిందా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం 1023 గురుకులాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తే.. వాటిని నిర్వీర్యం చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు. ప్రతి స్కూల్‌కు 200 కోట్లు ఖర్చు చేసి 109 స్కూళ్లు కడుతామని చెప్పి గత బడ్జెట్లో 2900 కోట్లు కేటాయించిందని, కానీ, అందులో 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తాజా బడ్జెట్లో కేవలం 5 వేల కోట్లే కేటాయించిందన్నారు. వ్యవసాయానికి గతేడాది 24,439 కోట్లు కేటాయించిందని, ఈ యేడాది 1,260 కోట్లు కోత పెట్టి 23,179 కోట్లకు కుదించిందన్నారు. రైతు భరోసా ఎకరాకు 15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో 18వేల కోట్లే కేటాయించిందన్నారు. అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల హామీని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని వాపోయారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, నాయకులు గోపు ఐలయ్యయాదవ్, నడిపెల్లి మురళీధర్‌రావు, నారాయణదాసు మారుతి, పూదరి చంద్రశేఖర్, కేదం కిశోర్, అఫ్జల్బాబా, ప్రేమ్‌కుమార్, గాజుల అరుణ్, నేరటి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాసనసభలో ప్రవేశపెడుతున్న ప్రైవేటు బిల్లుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మద్దతు ప్రకటించాలి. ఆ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించిన బిల్లే కాబట్టి పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు సైతం తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాలి. మద్దతు ఇస్తేనే కాంగ్రెస్ తన హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుంది.
బీసీ సబ్ ప్లాన్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి జీవోలు, ఆర్డినెన్స్‌లు ఇచ్చి మభ్యపెట్టారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను పూర్తిగా తుంగలోకి తొక్కారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేశామని ఢిల్లీ కేంద్రంగా సన్మానాలు చేయించుకున్నాడు. రాష్ట్రంలో ఉన్న బీసీ విజ్ఞాన వంతులు రేవంత్‌రెడ్డి కాలర్ పట్టి నిలదీయాలి. బజారుకు ఈడ్చాలి. ప్రజా స్వామ్యంలో ప్రశ్నించే వారు లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచే డబ్బులు పోతున్నాయి. ఓడెక్కె దాక ఓడ మల్లన్నా.. ఓడ దిగినాక బోడ మల్లన్న అన్న తీరుగా రేవంత్ పాలన ఉంది.
ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. అవే అబద్ధాలు ప్రస్తుత బడ్జెట్లోనూ ఉన్నాయి. పూర్తిగా వాస్తవ విరుద్ధంగా కేటాయింపులున్నాయి. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడమే తప్ప ఇచ్చిన ఏ ఒక్క దానికి కూడా పూర్తి స్థాయి కేటాయింపులు లేవు. లెక్కల్లో బాగానే కనిపిస్తున్నది. కానీ, ఖర్చు వరకు వస్తే ఏమీ ఉండడం లేదు. అన్నీ చేసినట్లు చూపుతున్నారు. ఏమీ చేయడం లేదు. ఇచ్చిన హామీలకు పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు లేవు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది. కానీ, ఈ సారి అందుకు తగినట్టుగా నిధులు ఇవ్వలేదు. గత బడ్జెట్లో 56,083 కోట్లు కేటాయించింది. తాజా బడ్జెట్లో మాత్రం 50,713 కోట్లకే పరిమితం చేసింది. 2024-25లో ఇప్పుడే అధికారంలోకి వచ్చినం. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి తప్పించుకున్నది. అప్పుడు ఇదే పథకాలకు 49,315 కోట్లు కేటాయించింది. కానీ, 24,948 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2025-26లో 35 వేల కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెబుతున్నయి. మహాలక్ష్మి పథకం కింద 18 నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన మహిళలకు ప్రతి నెలా 2500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 1.68 కోట్ల మంది మహిళలకు నెల నెలా 4200 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. కానీ, రెండేళ్లుగా వీరికి నిధులు కేటాయించడం లేదు. యువతులకు స్కూటీల పథకానికి ఈ బడ్జెట్లో ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. ఉచిత విద్యుత్ బిల్లు లబ్ధిదారులు 60 లక్షల మంది ఉంటే 48 లక్షల మందికే వర్తింపజేస్తున్నది.