జగిత్యాల, సెప్టెంబర్ 23 : రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్యక్షతన నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరై, మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ వేడుకలను ఎంతో గొప్పగా నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో చీకట్లో ఆడుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, చరిత్రను తొలగించేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని, తన అమ్మమ్మ ఇల్లు జిల్లాలోని పూడూరేనని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు బతుకమ్మ ఆడాల్నా, యూరియా కోసం లైన్లో నిలబడాల్నా తేలడం లేదన్నారు. మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతిలోని పూలతో బతుకమ్మ ఆడడం ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లేని గుర్తింపు తెలంగాణకు ఉందన్నారు.
ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ, ఉద్యమ కాలం నుంచి బతుకమ్మను ఆడి ఉద్యమ స్ఫూర్తిని రగిలించామన్నారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్‌రెడ్డిని మార్చే రోజు వస్తుందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్‌కు పంపుతామన్నారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అడ్డా అని గుర్తుంచుకోవాలన్నారు. వర్షాన్ని లెకచేయకుండా జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల నుంచి వచ్చి బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన అక్కాచెల్లెళ్లకు ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ, బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అని, తెలంగాణ తల్లి రూపం మార్చి ఇంకో తల్లి విగ్రహం పెట్టడం వారి మూర్ఖత్వమని విమర్శించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ కేసీఆర్ పాలనలో ఎలా ఉండేదో, కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందో ప్రజలంతా గమనించాలన్నారు.
జగిత్యాలలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్యక్షతన బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జగిత్యాలతో పాటు ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. వీరితో కలిసి బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు ఉత్సాహంగా ఆడిపాడారు.