జగిత్యాల, మార్చి 21: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారని, ఆయన హయాంలో ఎవరికీ కొత్తగా సంక్షేమ పథకాలు అందలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. హామీలు అమలు కోసం పదిహేను నెలలు ఓపిక పట్టామని.. ఇకనుంచి సర్కారు అరాచక పాలనపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ నెల 23న కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అధ్యక్షతన జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించిన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు అందడం లేదని.. ఇదేంటని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ఉద్యోగులు, ఆర్టీసీ, విద్యుత్, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉద్యమాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా ఓపిక పట్టాలని, పార్టీని వీడిన నాయకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆదివారం కరీంనగర్లో కేటీఆర్ నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, కేటీఆర్ నిర్వహించే సమావేశానికి జగిత్యాలలోని మూడు నియోజకవర్గాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరాచక పాలనపై పోరాటం చేయడమే మనముందున్న లక్ష్యమన్నారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.