మల్యాల, జూన్ 21: కొండగట్లు హనుమాన్ ఆలయ అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన దేవాలయాలను పునరుద్ధరిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధితో బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు స్వామివారికి అభిషేకం చేశారు. వేదపండితులచేత ప్రవచనాలు, సామూహిక భజనలు, సహపంక్తి భోజనాలు, సహస్ర దీపాలంకరణ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన కేబీ శర్మ నేతృత్వంలో భక్త సంగీత ప్రదర్శన, సంగెం రాధాకృష్ణ నేతృత్వంలో సంగీత నృత్యాలు, లలితా ప్రసాద్ బృందం అన్నమయ్య కీర్తనలు, భోగ ధర్మరాజు నేతృత్వంలో కూచిపూడి నృత్యాలు, జగదీశ్వర్, నరేందర్ శర్మ నేతృత్వంలో భక్తి గీతాలాపన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె మాట్లాడుతూ స్వరాష్ట్రంలో దేవాలయాలకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్విరామంగా శ్రమిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇదే తరహాలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి నడుంబిగించారని చెప్పారు. ఇటీవలే ఆయన కొండగట్టుకు వచ్చి అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారన్నారు. ప్రస్తుతం ఆలయంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అర్చక ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ధూపదీప నైవేద్య స్కీం కింద ఆలయాలకు నిధులకు సమకూరుస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని 26 ఆలయాలను గుర్తించి క్రమం తప్పకుండా నిధులిస్తున్నదని పేర్కొన్నారు. కాగా పలువురు అర్చకులకు నియాకమక పత్రాలు అందించారు. అనంతరం వారితో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో టీ వెంకటేశం, చైర్మన్ టీ మారుతీస్వామీ, జడ్పీటీసీ రాంమోహన్‌రావు, కొడిమ్యాల ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మల్యాల ఏఎంసీ చైర్మన్ కొరండ్ల నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు, ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్‌రావు, రవీందర్‌రెడ్డి, నేతలు కృష్ణారావు, జనగం శ్రీనివాస్, పులి వెంకటేశం గౌడ్, మదుసుదన్,అనువంశీక అర్చకులు కఫీంధర్, జతేంద్రప్రసాద్, రఘు, రామకృష్ణ, చిరంజీవస్వామి పాల్గొన్నారు.