Road Accident | ఓదెల, ఫిబ్రవరి 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన సాతూరి సందీప్(32) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు పెద్దపల్లిలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామం నుంచి ప్రతిరోజు పెద్దపల్లికి బైక్ పై వెళ్లి వస్తుంటాడు. సోమవారం రాత్రి పెద్దపల్లి నుంచి స్వగ్రామానికి బైకుపై వస్తుండగా కొలనూరు గ్రామ శివారులో రోడ్డు మూలమలుపు వద్ద బైకు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. కాగా ఎదురుగా వాహనం వచ్చి లైట్ల వెలుతురుకు రోడ్డు కనిపించక ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొలనూరుకు చెందిన దేవమ్మ-మొండయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు, కాగా సందీప్ చిన్నవాడు. అవివాహితుడు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ఘటనా స్థలానికి పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.