Chadha Venkat Reddy | చిగురుమామిడి, నవంబర్ 20 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అనేక మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత మార్చడం దుర్మార్గమని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీ, ఐజీల సమావేశం ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో నిర్వహించాలని చూస్తున్నారన్నారు.
ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే చెప్పు విసిరితే ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేని కేంద్ర ప్రభుత్వంపై అనుమానం కలుగుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఉందన్నారు.
పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు లేవని, స్పీకర్ కు ఇష్టముంటే పెండింగ్లో పెట్టడం, ఇష్టం లేకుంటే తీసివేయడం జరుగుతుందన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని, తెలంగాణలో డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే వందేళ్ల ఉత్సవాల బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జోడేఘాట్లో ప్రారంభమైన జాతా ఈ నెల 21న భద్రాచలంలో ముగుస్తుంద న్నారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందే చిన్నస్వామి, చాడ శ్రీధర్ రెడ్డి, బూడిద సదాశివ, గోలి బాపురెడ్డి, ముద్రకోల రాజయ్య, బోయిని పటేల్, మావురపు రాజు, తేరాల సత్యనారాయణ, రాకం అంజవ్వ తదితరులు పాల్గొన్నారు.
రేకొండలో పలుకుటుంబాలకు చాడ పరామర్శ
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చాడ రాజిరెడ్డి, రాదారపు మల్లవ్వ, వర్ణ విమల, కండె బుచ్చయ్య కుటుంబాలను సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.