Dharmaram | ధర్మారం ,మే 13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్య నిర్వహణ అధికారి కొస్న కాంతారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్, ఆలయ ధర్మకర్తలు జక్కుల మానస సంతోష్, నూనె లక్ష్మి మల్లేష్, సాగంటి సంతోష్ కుమార్, మల్లెత్తుల సంతోష్, జంగిలి రాజు, కాశీపాక అశోక్, అర్చక ధర్మకర్త గరిమైళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి ఆలయ ప్రాంగణంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.
ఇట్టి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చివరి రోజున స్వామివారి రథోత్సవం ( జాతర) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథం వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథంపై లక్ష్మీదేవి, శ్రీ నరసింహుడి ఉత్సవమూర్తుల విగ్రహాలు పెట్టి భక్తులు కలిసి లాగడంతో జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతర ఉత్సవానికి మంచిర్యాల ,గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు జాతర ఉత్సవానికి హాజరుకాగా ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆలయ కమిటీ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు .కాగా ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గుడి ప్రాంగణంలో ఉన్న రథాన్ని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. కాగా తమ కోరిన కోరికలు తీరాయని స్వామికి పట్టేనామాలు, కోరమీసాలు భక్తులు సమర్పించుకున్నారు. తమకు తోచిన విధంగా భక్తులు హుండీలో నగదు తో పాటు కానుకలు వేశారు.
మొక్కులు సమర్పించిన అనంతరం గుడి ఎదుట స్వామివారికి కోళ్లను, మేకలను బలి ఇచ్చారు. ఎంతోమంది భక్తులు ఆలయ పరిసరాలలో వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా సహపంక్తి భోజనాలు చేశారు. పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ లావుడియా రూప్లా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగి రెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హనుమయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నరసింహం, పార్టీ నాయకులు చింతల ప్రదీప్ రెడ్డి, చింతల జగన్ మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.