ఒకప్పుడు నష్టాలే తప్ప లాభాలు అంటే ఏంటో తెలియని ఆ బ్యాంకు.. ఇప్పుడు సహకార రంగానికే ఆదర్శంగా నిలుస్తున్నది. నాడు మూసివేత దిశగా అడుగులు వేసినా.. నేడు ప్రగతి ప్రస్థానంలో పరుగులు పెడుతున్నది. ఒడిదొడుకులను ఎదుర్కొంటూ.. నష్టాలను పూడ్చుకుంటూ.. ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని 8వేల కోట్లకు విస్తరించింది. అంతేకాదు, ఏటా వంద కోట్ల లాభాలను ఆర్జిస్తూ.. ప్రభుత్వ రంగంలోని ప్రధాన బ్యాంకులకు దీటుగా సేవలందిస్తూ.. అందరితో ప్రశంసలందుకుంటున్నది. ఈ ప్రగతి ప్రస్థానంలో ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కరీంనగర్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, ఇప్పుడు మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నది. పటిష్టమైన నాయకత్వం, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే ప్రగతి ఎలా సాధించవచ్చో చెప్పడానికి కేడీసీసీబీ నిదర్శంగా నిలుస్తున్నది.
కరీంనగర్, మార్చి 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్ (కేడీసీసీబీ) ఒకనాడు నష్టాల బాటలోనే నడిచింది. మితిమీరిన రాజకీయ జోక్యం, అడుగడుగునా అక్రమాలు, లోపించిన పారదర్శకత వంటి అనేక కారణాల వల్ల తిరోగమనంలో నడిచింది. 200 కోట్ల వ్యాపారంతో 58 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ బ్యాంకు, సహకార బ్యాంకుల్లో దేశంలోనే చిట్టచివరిగా నిలిచింది. ఇక బ్యాంకు పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో సరిగ్గా ఇరువై ఏళ్ల క్రితం పురోగమనంవైపు అడుగులు వేసింది.
2005లో బ్యాంకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొండూరు రవీందర్రావు, సహకార రంగంపై తనకున్న అనుభవాన్ని రంగరించి, పకడ్బందీ ప్రణాళికలతో బ్యాంకును అంచలంచెలుగా నష్టాల నుంచి గట్టెక్కిస్తూ వచ్చారు. 2012 వరకు నష్టాలను పూడ్చివేసి.. ఆ యేడాది నుంచి లాభాల బాట పట్టించారు. ఇదే తరుణంలో 2014లో సీఈవోగా నందెల్లి సత్యనారాయణరావు బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు, సీఈవో కలిసి కట్టుగా పనిచేయడంతో బ్యాంకు ఆనాటి నుంచి ఈనాటి వరకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. నాడు నష్టాల్లో కూరుకుపోయిన బ్యాంకు, ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని 8వేల కోట్లకు విస్తరించింది. అంతేకాదు, ఏటా వంద కోట్ల లాభాలు ఆర్జిస్తూ దేశంలోనే సహకార రంగానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
ప్రతి సంస్థకు లాభనష్టాలు అనేవి దానిని నడిపించే నాయకత్వంపై ఆధారపడి ఉంటాయి. ఈ బ్యాంకు విషయంలోనూ అదే జరిగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకును ఆధునీకరిస్తూ.. వినియోగదారుల మెప్పు పొందేందుకు అనువైన మార్గాలను పాటిస్తూ ప్రయాణం సాగించింది. తన వ్యాపారాన్ని విభిన్న రంగాలకు వర్తింప జేసింది. రైతులకు వ్యవసాయ రుణాలు ఇస్తూనే.. మహిళా సంఘాలకు 200 లక్షల వరకు, విదేశాలలో ఉన్నత విద్య కోసం గ్రామీణ విద్యార్థులకు గరిష్ఠంగా 50 లక్షల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల గృహ నిర్మాణానికి గరిష్ఠంగా 75 లక్షల వరకు రుణాలు ఇచ్చింది. అలాగే వ్యాపార, వాణిజ్య అవసరాలతోపాటు చిన్న, సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు రుణాలు ఇచ్చి, తన వ్యాపారాన్ని విస్తరించింది.
ఈ విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. రుణ మంజూరు, రుణ వసూళ్లు, బ్యాంకు రోజువారి కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం లేకుండా.. అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో జవాబుదారీతనంతో పనిచేయడానికి వీలు కల్పిస్తూ ప్రగతి బాటలో నడిపింది. 2012 నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగుల నియమించడం, 2019 నుంచి మౌఖిక పరీక్ష లేకుండా రాత పరీక్ష ద్వారా మాత్రమే నియామకాలు చేపట్టడం, వాణిజ్య, ప్రైవేట్ బ్యాంకుల తరహాలో బ్యాంకు బ్రాంచిలో ఆధునిక సౌకర్యాలను, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వసతులను కల్పించడం, బ్యాంకింగ్‌లో ఆధునిక టెక్నాలజీని వినియోగించి ఖాతాదారులకు మెరుగైన సేవలను పెంచుతూ వచ్చింది.
బ్యాంకు పరిధిలోని 131 సహకార సంఘాలను ఆధునీకరించి సంఘాల ద్వారా వ్యవసాయదారులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇవ్వడమే కాదు, అదే స్థాయిలో పంటలు కొనడం, అక్కడితో ఆగకుండా ఆయా సంఘాల పరిధిలో 38 పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయడం, ప్రతి సంఘం పరిధిలో గోడౌన్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్ నిర్మించడం వంటివి చేసింది. అందుకోసం నాబార్డ్ సహాయంతో ఒక శాతం వడ్డీతో రుణాలు అందేలా చర్యలు తీసుకోవడం, కలెక్టర్ల సహకారంతో 6 సంఘాల పరిధిలో 3.80కోట్ల చొప్పున 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను స్థాపించడం, రుణాల మంజూరులో జాప్యం లేకుండా చూడడమే కాదు, రుణ వసూళ్లను 98 శాతం ఉండేలా చూసుకోవడం వంటివి చేసింది.
నానాటికీ అగమ్యగోచరంగా మారుతున్న సహకార రంగంలో కేడీసీసీబీ మాత్రం దేశానికి ఒక నమూనాగా మారింది. అంతేకాదు, వరుసగా 2012 నుంచి లాభాల బాటలో పయనిస్తున్నది. దేశంలో మరే బ్యాంకు కేడీసీసీబీ దరిదాపుల్లో లేదు. బ్యాంకు అంకిత భావాన్ని, పెరుగుతున్న వినియోగదారుల నమ్మకాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం, పలుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు అవార్డులను ప్రకటిస్తూ వచ్చింది. 2015-16 నుంచి 2024-25 వరకు వరుసగా కేడీసీసీబీ జాతీయ స్థాయిలో అత్యుత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందడమేకాదు, ఎన్నో అవార్డులను అందుకున్నది.
నానాటికీ లాభాలు పెరగడం, బ్యాంకు పనితీరు దేశంలోని సహకార రంగానికి ఆదర్శంగా నిలిచిన పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం, ఈ సారి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనపరిచిన బ్యాంకుగా (బెస్ట్ ఫర్ఫార్మెన్స్) ఎంపిక చేసింది. ఈ అవార్డును 17వ తేదీన సిక్కీం రాజధాని గ్యాంగ్‌టక్ వేదికగా న్విహించే కార్యక్రమంలో సీఈవో సత్యనారాయణరావు అందుకోనున్నారు. వరుసగా జాతీయ అవార్డులు అందుకుంటున్న బ్యాంకు పనితీరుపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది.
సుదీర్ఘకాలం బ్యాంకు అధ్యక్షుడిగా కొనసాగిన రవీందర్రావు ఇచ్చిన సూచనలు, సలహాలు బ్యాంకు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా బ్యాంకును ముందుకు తీసుకెళ్లడానికి సిబ్బందికి ఆయన స్వేచ్ఛను ఇచ్చారు. ఈ రోజు జాతీయ స్థాయిలో వరుస అవార్డులు సాధిస్తున్నామంటే దాని వెనుక అధ్యక్షుడి శ్రమ, పట్టుదల దాగి ఉన్నది.
ఇదే సమయంలో బ్యాంకు, అనుబంధ రంగాల శాఖల్లోని సిబ్బంది ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. నిజానికి జాతీయ స్థాయిలో తొమ్మిదోసారి అవార్డు రావడం సంతోషంగా ఉన్నది. ఇది మా అందిరి సమష్టి విజయం. భవిష్యత్‌లోనూ బ్యాంకు వన్నె తగ్గకుండా మరింత ప్రగతి సాధించేలా పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తాం. ఈ విజయ పరంపరలో పాల్గొన్న పాలకవర్గంతోపాటు ప్రతి ఒక్కరికీ బ్యాంకు నుంచి అభినందనలు తెలుపుతున్నా.
– నందెల్లి సత్యనారాయణరావు,