Vinod Kumar | సిరిసిల్ల టౌన్, నవంబర్ 27: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ నేత కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం దీక్షా దివాస్ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న బలమైన నినాదంతో దీక్షా దివాస్ చేపట్టారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నవంబర్ 29 చరిత్రలో ముఖ్యమైన ఘట్టం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తుపాకులు పట్టుకుని బెదిరించిన వ్యక్తులే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి, రైజింగ్ అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఏటా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యంలో మేము గౌరవిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పై అబద్దాలు, దుష్ప్రచారం చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పుట్టిందే బీఆర్ఎస్ అని అన్నారు.
నక్సలైట్ల పేరుతో యువకులను కాల్చివేయడం, రైతుల ఆత్మహత్యలు వీటన్నింటిని చూసి చలించిపోయిన కేసీఆర్ దగా పడ్డ తెలంగాణ కోసం రాజకీయ ఉద్యమాన్ని గులాబి జెండా ద్వారా తీసుకువచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి సంపండని ప్రజలకు చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి, పదేండ్ల పాలనలో అభివృద్ధి చేసి చూపించినమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గులాబి జెండా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివాస్ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు.
దీక్షా దివాస్ వేదిక వద్ద ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజవయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ సంస్థల మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, న్యాలకొండ రాఘవరెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, అర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మ్యాన రవి, సబ్బని హరీష్, వెంగళ శ్రీనివాస్, మాట్ల మధు తదితరులు పాల్గొన్నారు.