2001 ఏప్రిల్ 27 పురుడు పోసుకున్న భారత రాష్ట్ర సమితి.. తన 24 ఏండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకొని.. వచ్చే నెల 27న 25వ ఏట అడుగు పెడుతోంది. ఈ పాతికేళ్ల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు.. వచ్చే నెలలో వరంగల్లోజరిగే రజతోత్సవ సభ విజయవంతం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు.. కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతుండగా.. ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది గులాబీ దండు కదలి వస్తోంది.
కరీంనగర్, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విప్లవాల ఖిల్లా.. పోరాటాల పురిటిగడ్డపై పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఓ పడిలేచిన తరంగం.. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కెరటం. ఒక ప్రాంత సమస్య కోసం ఎన్నోసార్లు పదవులను తృణపాయంగా వదులుకొని దేశచరిత్రలో రికార్డు సృష్టించడమే కాదు.. ఇక్కడి ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన ఘనత గులాబీ పార్టీకి సొంతం. దశాబ్దాల కాలంగా జరిగిన జల, వనరుల దోపిడీ, భూముల స్వాహా, రాజ్యాంగ ఉల్లంఘనపై పోరాటాలు చేసి.. అంతిమ గమన్యాన్ని ముద్దాడి..
అనతి కాలంలోనే.. తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచ పట ముఖచిత్రంలో నిలిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుంది. పార్టీ చేసిన ప్రతిపోరాటానికి కలిసి కదలిన కరీంనగర్ గడ్డ.. పదేళ్ల పాలనలోనూ అండగా నిలిచింది. అందుకే నాడు ఉద్యమకాలంలో ఎన్నో పోరాటాలకు ఈ గడ్డపై పిలుపునిచ్చిన ఆనాటి ఉద్యమ సారథి కేసీఆర్.. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇదే గడ్డపై నుంచి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు.
బలమైన పునాదులు
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు బలమైన పునాదులున్నాయి. ఏ పార్టీకి లేనంతగా సభ్యత్వం బీఆర్ఎస్కు ఉన్నది. ఉమ్మడి జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఆరు లక్షల పైచిలుకు సభ్యత్వం గల ఏకైక పార్టీ బీఆర్ఎస్. అందుకే.. సర్పంచ్ నుంచి మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల వరకు గులాబీ జెండా రెపరెపలాడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఒడిదొడుకులకు పార్టీ లోనైనా తిరిగి పుంజుకున్నది.
ప్రధానంగా.. లెక్కలకు మించిన హామీలు, అబద్ధపు ప్రచారాలు, బీఆర్ఎస్పై అసత్య ఆరోపణలు చేసి.. కొన్ని వర్గాల ప్రజలను నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ కొన్నిచోట్ల సఫలం కావడం వల్ల బీఆర్ఎస్ నష్టపోయింది. కానీ, గడిచిన కాంగ్రెస్ 15 నెలల పాలనలో ప్రజల్లో వెల్లువెత్తుతున్న అసంతృప్తి.. నాటికీ నేటికి పరిస్థితులను పోల్చిచూస్తున్న ప్రజలు అడుగడుగునా గులాబీ పార్టీకి జై కొడుతున్నారు. ఎవరిని కదలించినా.. సరే.. గులాబీ పార్టీని గుండెల్లోనింపుకొంటున్నారు.
ఉద్యమంలోనూ జిల్లా నుంచే కీలక ఘట్టాలు
బలవంతపు పెళ్లి చేసి.. తెలంగాణ వీలీనం తదుపరి.. అడుగడుగునా కన్నీళ్లు దిగమింగి.. కష్టాలను మోసిన తెలంగాణను విముక్తి చేసేందుకు.. పలు ఉద్యమాలు పుట్టినా.. అవేవీ గమ్యస్థానాన్ని ముద్దాడలేకపోయాయి. ప్రత్యేక’ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చే లక్ష్యంతో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) ఏర్పాటు చేశారు. అలా ఒక్క నాయకుడితో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ తదుపరి నాలుగుకోట్ల ప్రజల గుండెచప్పుడులా మారింది. గమ్యాన్ని ముద్దాడి తెలంగాణ ప్రజల కళను నెరవేర్చింది. ఈ పోరాటంలో అత్యంత కీలకమైన ఎన్నో ఘట్టాలను కేసీఆర్ ఈ గడ్డపై నుంచే ప్రకటించారు.
అందులో కొన్ని మచ్చుకు..
2001 ఏప్రిల్ 27: కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగుదేశం పార్టీకీ, తన శాససభ సభ్యత్వానికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు.
2001 మే17: కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా ‘సింహగర్జన సభ’ నిర్వహించారు. లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (ప్రస్తుత భారత రాష్ట సమితి )ఏర్పాటును కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. తెలంగాణ వచ్చే దాకా మడమ తిప్పబోనని ప్రతినబూనారు. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఈ సభ విజయవంతమైన ఘనత కరీంనగర్ గడ్డకే దక్కింది. దేశ వ్యాప్తంగా స్వరాష్ట్ర సాధనకోసం ఎన్నో ఉద్యమాలు జరిగినా.. సింహగర్జన మాత్రం వాటన్నింటికీ మించి ఓ చరిత్రను సృష్టించింది. తెలంగాణ అకాంక్షను నలుదిశలా చాటి చెప్పింది.
2004 జూన్ 7: 2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, తనదైన స్థాయిలో చక్రం తిప్పి, ఆ ఏడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేయగలిగారు. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘనత కూడా ఈ గడ్డకే దక్కింది. 2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా బీఆర్ఎస్ విజయమే!
అప్పుడు కూడా కరీంనగర్ ఎంపీగానే ఉన్నారు
2006 సెప్టెంబర్ 12: కరీంనగర్ లోకసభ స్థానానికి కూడా కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ వాదం లేనే లేదంటూ కొంత మంది కాంగ్రెస్ నాయకులు చేసిన వితండ వాదనలు, వ్యాఖ్యలతో కలత చెందిన కేసీఆర్.. తన పదవులను తృణ ప్రాయంగా వదిలిపెట్టి.. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్వరాష్ట్ర సాధనలో పదవుల త్యాగానికి శ్రీకారం చుట్టిన ఘనత ఈ ప్రాంతానికే దక్కింది.
2006 డిసెంబర్ 7: కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 2,01,582 ఓట్ల మెజార్టీనిచ్చి ఈ గడ్డ ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారు. ప్రత్యేక తెలంగాణ వాదం ఉందని ప్రజలు నలుమూలలా చాటిచెప్పారు. ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్కు పునర్జన్మనిచ్చిన ఖ్యాతి కూడా కరీంనగర్‌కే దక్కుతుంది. నిజానికి ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కేసీఆర్‌ను ఓడించి.. తెలంగాణ వాదం లేదని చెప్పడానికి.. ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. యావత్ మంత్రులను నియోజకర్గంలో దించి.. కోట్ల రూపాయల పంపకాలు చేశారు. కానీ.. కరీంనగర్ గడ్డ ప్రజలు వారి ప్రలోభాలకు లొంగలేదు. భారీ మెజార్టీ ఇచ్చి కుట్రదారుల చెంపచెల్లుమనిపించిన ఘతన కూడా ఇక్కడి ప్రజలకే దక్కుతుంది.
2009 నవంబర్ 29: ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కరీంనగర్‌లోని తన భవన్ నుంచి బయలు దేరిన కేసీఆర్‌ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి నమ్మించి.. నయవంచనకు ఆనాటి పాలకులు, పోలీసులు పాల్పడి అరెస్టు చేస్తే.. ఆదే రోజు కరీంనగర్ భగ్గుమంది. కేసీఆర్‌కు అండగా నిలిచింది. కరీంనగర్లో ప్రారంభమైన ఉద్యమ ఉగ్రరూపం 24 గంటల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. 11 రోజులపాటు సాగిన ఆమరణ నిరాహార దీక్షతో.. దిగొచ్చిన కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విజయం వెనుక కరీంనగర్ ప్రోత్సాహం ఉంది.
2011 సెప్టెంబర్ 23: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం చరిత్రలో నిలిచిపోయే సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీద నుంచే కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన సభలో సకల జనుల చారిత్రక సమ్మెకు రణ భేరి మ్రోగించారు. ఈ సమ్మె యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది.
2012 నవంబర్ 7, 8: తెలంగాణ రాష్ట్ర సమితి రెండు రోజుల పాటు కార్యవర్గ సమావేశాలను అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రతిమ హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యవర్గ సమావేశాల్లో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు…తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం విరమించేది లేదని ఈ గడ్డ వేదికగా ప్రతినబూనారు.
2013 సెప్టెంబర్ 7: తెలంగాణ సాధనకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ శిబిరాలను నిర్వహించి తొలి శిక్షణ శిబిరాలను హుజూరాబాద్ కేంద్రంగా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఆనాడు బ్రోచర్లు, పుస్తకాల ద్వారా అందించిన సమాచారం, ఉద్యమనేత ఆనాడు తెలంగాణ జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు ఉద్యమం వైపు అందరినీ కదిలించింది.
2014 ఏప్రిల్ 13: ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సమావేశంలో తొలి సమర శంఖారావం పూరించారు. అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది.
ఎట్లుండె కరీంనగర్.. ఎట్లాయె..
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక వెలుగు వెలిగింది. కాళేశ్వర జలాలు కదలి రావడంతో మండు వేసవిలోనూ ఎగువమానేరుతోపాటు వందలాది చెరువులు మత్తళ్లు దుంకాయి. శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం కింద కాళేశ్వరం జలాలను వరదకాలువ ద్వారా ఎగువకు ఎక్కించిన ఘనత కేసీఆర్‌కు దక్కింది. మధ్యమానేరును 365 రోజులపాటు నిండుకుండలా మార్చి.. ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోశారు.
ఒకవైపు మానేరు.. మరోవైపు గోదావరి జలాలు.. ఇంకోవైపు వరదకాలువ ఇలా నలువైపులా నీటి పరవళ్లు ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం పండుగలా మారింది. పదేళ్లలో వేసిన పంటల్లో ఒక్క ఎకరం కూడా ఎండలేదు. 2014లో అన్ని పంటలు కలిపి 11,79,013 ఎకరాల్లో సాగు చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 22,41,066 ఎకరాలకు పెరిగింది. అంటే ఉమ్మడి జిల్లాలో 10,62,053 ఎకరాల్లో సాగు పెరిగింది. 2014లో వరిసాగు ఉమ్మడి జిల్లాలో 3,63,776 ఎకరాల్లో ఉంటే కాళేశ్వరం జలాలు రావడంతో బీఆర్ఎస్ హయాంలో 12,35,223 ఎకరాలకు పెరిగింది. అంటే, 8,71,447 ఎకరాల్లో వరి విస్తీర్ణం పెరిగింది.
ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. ప్రతి రంగంలోనూ ఇదే ప్రగతి కనిపించింది. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ 14 నెలల కాలంలోనే పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఎక్కడ చూసినా వేసిన పంటలు వేలాది ఎకరాల్లో ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు బావురుమంటోంది. చెరువులు నెర్రలు పెడుతుండగా.. వరదకాలువ మళ్లీ సమైక్య పరిస్థితికి చేరుకుంది. నిర్వహణ లోపం వల్ల… గ్రామాల మధ్య నీటికోసం తగాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పలు గ్రామాల్లో తాగునీటకి తండ్లాట మొదలైంది. మరో పక్షం రోజుల్లో.. తాగు, సాగునీటికి సంక్షోభం వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి.
విప్లవాత్మక పథకాలకు ఈ గడ్డపై నుంచే అంకురార్పణ
ఆది నుంచి పోరాటాలకు అండగా నిలువడమే కాకుండా.. గమ్యస్థానాన్ని ముద్దాడి, స్వరాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత పదేళ్ల పాలనలోనూ.. ఉమ్మడి జిల్లా వాసులు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ విజయాన్ని సమకూర్చారు. అందుకే.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశానికి అదర్శంగా నిలిచిన ఎన్నో పథకాలను కరీంనగర్ గడ్డపై నుంచే ప్రకటించారు.
అందులో మచ్చుకు కొన్ని..
2014 ఆగస్టు 5: తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ తొలి అధికారిక పర్యటన చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జడ్పీ కార్యాలయంలో సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఈ గడ్డపై నుంచి ప్రకటించారు. ఈ పథకం దేశ దృష్టిని అకర్షించడమే కాదు.. యావత్ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
2015 జూలై 4: రాష్ట్రంలో అంతరించి పోతున్న అటవీ సంపద పెంచాలన్న లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మొదట హుస్నాబాద్‌లో ప్రారంభించారు. ఇది దేశంలోనే ఒక చరిత్రను సృష్టించింది.
2018 ఫిబ్రవరి 26: రైతాంగ చరిత్రలో నూతన అధ్యయానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ మైదానంలో జరిగిన సభావేదికగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇదే వేదికపై నుంచి ప్రకటించారు. ఇది యావత్ రైతాంగానికి ఒక భరోసా కల్పించడమేకాదు.. దేశాన్ని అలోచింపజేసింది
2018 మే 10: లక్షలాది మంది రైతుల ఆశలకు జీవం పోస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా జరిగిన సభలో రైతుబంధు పథకాన్ని గడ్డ పైనుంచే ప్రకటించారు. ఈ పథకాన్ని కేంద్రం సైతం కాపీ కొట్టింది. పలు రాష్ర్టాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అన్నదాతల జీవన గమణానికి ఈ వేదిక జీవనాడిలా నిలిచింది.
2021 ఆగస్టు 16: దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ మండలం శాలపల్లి వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రారంభించారు.
నేడు రజతోత్సవ సన్నాహక సమావేశం
జిల్లాల వారీగా రజతోత్సవ సన్నాహక సమావేశం ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రంలో పూర్తికాగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ నిర్వహించాలన్న లక్ష్యంతో ఆదివారం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాది మంది ముఖ్య కార్యకర్తలు తరలి వస్తుండగా.. కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే నగరాన్ని గులాబీ మయం చేసిన పార్టీ శ్రేణులు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఘనస్వాగతం పలికే విధంగా రంగం సిద్ధం చేశాయి. ముందుగా కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభించి.. తెలంగాణ చౌక్, కమాన్‌మీదుగా సభా ప్రాంగణమైన వీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించనున్నారు.