మల్యాల, ఫిబ్రవరి 14 : స్వరాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆరే హిందూ ధర్మాన్ని కాపాడే అసలైన హిందువని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ ఎన్నికల కోసం రాముడిని వాడుకుంటున్నారని, నిజంగా ధర్మాన్ని కాపాడే వారే అయితే కొండగట్టు ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.వంద కోట్ల నిధులు తేవాలని డిమాండ్ చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన సందర్భంగా మంగళవారం సాయంత్రం మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉత్తర తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అయినందున వారి మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.వంద కోట్లు మంజూరు చేశారని తెలిపారు. సంజయ్, అరవింద్ రాముడి పేరు చెప్పి ఎంపీలు అయ్యారని, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయ అభివృద్ధికి కూడా ఒక్క రూపాయి తేలేదని, నిజంగా హిందువులైతే తాము ఇచ్చే నిధులకు తోడుగా కేంద్రం నుంచి రూ.100 కోట్లు తేవాలని, అప్పుడే నిజమైన హిందువులుగా చూస్తామని హితవుపలికారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మరింత తగ్గిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోసం దేవుళ్ళను వాడుకుంటున్న బీజేపీ నాయకులను రానున్న ఎన్నికల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు.