Mla Padi koushik Reddy | జమ్మికుంట, ఏప్రిల్ 17: రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్థానిక పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతులకు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, రైతులు పండించిన పంటలన్నింటికీ బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. తరుగు, కోతలు లేకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధరతో రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని, ధాన్యం విక్రయించిన డబ్బులతో పాటు బోనస్ ను వెంటనే రైతుకు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, మార్కెట్ పాలకవర్గం, అధికారులు, రైతులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.