యాదాద్రిని అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ నర్సన్న దీవెనతో అంజన్న చెంతకు కదిలారు. హన్మాన్ ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతానని, స్వయంగా పరిశీలిస్తానని రెండు నెలల క్రితం జగిత్యాల పర్యటనలో చెప్పిన మాట మేరకు బుధవారం కొండగట్టుకు వస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఇటీవలే 100 కోట్లు మంజూరు చేసిన ఆయన, నేడు స్వామి వారిని దర్శించుకోనున్నారు. దాదాపు 3 గంటలపాటు గుట్టపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి గుడి, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట, తదితర స్థలాలను పరిశీలించి, తర్వాత జేఎన్టీయూలో అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఏర్పాట్లను పరిశీలించారు.
– జగిత్యాల, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) / మల్యాల
జగిత్యాల, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) / మల్యాల : నాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని పుణ్యక్షేత్రాల్లాగే కొండగట్టు సైతం గుర్తింపునకు నోచుకోలేదు. భక్తుల కొంగుబంగారంగా ప్రకృతి రమణీయ ప్రదేశాల మధ్యన ఉన్న ఈ దేవస్థానాన్ని నాటి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నా అందుకనుగుణంగా అభివృద్ధి చేయలేదు. ఆలయాన్ని విస్తరించలేదు. కొండపైకి సరైన రోడ్డు సౌకర్యాన్ని సైతం అభివృద్ధి చేయలేదు. కనీసం తాగునీటి వసతి కల్పించలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొండగట్టులో అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ ప్రారంభమైంది.
మొదట తీవ్రంగా ఉన్న నీటి కొరతను తీర్చారు. ప్రత్యేక మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా 4.5 కోట్లతో కొండగట్టు దిగువన ప్రత్యేక నీటి సంపును ఏర్పాటు చేసి, అక్కడి నుంచి కొండపైకి పంపింగ్ చేసి, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు. 2.5 కోట్లతో నూతన పుష్కరిణి నిర్మించి, వినియోగంలోకి తెచ్చారు. 2.50 కోట్లతో మెట్లదారి సుందరీకరణ పనులకు దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే, మెట్లను రీడిజైనింగ్ చేయాల్సి రావడంతో కాస్త జాప్యం జరిగింది. ఇటీవలే టెండర్లు పూర్తి కాగా, పనులు ప్రారంభం కావాల్సి ఉన్నది. ఆలయ పరిధిలోని వాహనాల పార్కింగ్ స్థలం పక్కన 2.50 కోట్లతో దీక్షావిరమణ మండపానికి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. 4 కోట్లతో ఆలయ కార్యనిర్వహణాధికారి, కార్యాలయ పనులు కొనసాగించేందుకు నూతన భవనం నిర్మాణమైంది. 90 లక్షలతో చేపట్టిన రామకోటి స్తూపం నిర్మాణం తుదిదశకు చేరింది.

సీఎం హోదాలో మొదటిసారి కొండగట్టుకు
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 జూన్‌లో కొండగట్టుపై ఉన్న వాటర్ ట్యాంకు హఠాత్తుగా కూలిపోయింది. అప్పుడు ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలుసుకున్న కేసీఆర్, వెంటనే కొండగట్టుకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు సాయం చేయడంతోపాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చేశారు. దాదాపు 19 ఏండ్ల తర్వాత కేసీఆర్ కొండగట్టుకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా నేడు రానున్నారు. దాదాపు 3 గంటలపాటు కొండపైనే ఉండనున్నారు. స్వామివారి దర్శనం తర్వాత కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట, తదితర స్థలాలను స్వయంగా పరిశీలిస్తారు.
100 కోట్లతో ప్రణాళికలు
గత డిసెంబర్ 7న జగిత్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మోతెలో జరిగిన భారీ బహిరంగ సభా వేదికగా కొండగట్టు, ధర్మపురి, వేములవాడ రాజన్న ఆలయాల గురించి ప్రస్తావించారు. వాటి అభివృద్ధి కోసం చేపట్టబోయే ప్రణాళికలను వివరించారు. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని, దేశంలోనే గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వంద కోట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతోపాటు త్వరలోనే ఆగమ శాస్త్ర పండితులు, స్థపతులు ఆలయాన్ని పరిశీలించి, గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. ఆ మేరకు ఈనెల 8న వంద కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు 100 కోట్లతో కొండగట్టు అభివృద్ధికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటుండగా, సీఎం ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఇప్పటికే రెండుసార్లు కొండగట్టు క్షేత్రాన్ని పరిశీలించారు.
స్వామివారి సన్నిధానానికి 12 ఎకరాలు
ముఖ్యంగా అంజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు దేవాదాయశాఖ ఆధీనంలో కేవలం 20 ఎకరాలే ఉండడం అడ్డంకిగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొండగట్టు గుట్టలపై రెవెన్యూ ఆధీనంలో ఉన్న 383 ఎకరాల స్థలాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. దీనికితోడు ఇతర స్థలాన్ని కలుపుకొని మొత్తం 412 ఎకరాల స్థలం ప్రస్తుతం ఆ శాఖ ఆధీనంలోకి వచ్చింది. దీంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. కొండగట్టును గొప్పక్షేత్రంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు అనేక మార్పులు వచ్చే అవకాశమున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ డిజైన్ల రూపకర్త, ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఇప్పటికే రెండుసార్లు కొండగట్టు క్షేత్రాన్ని పరిశీలించి, గుట్ట అభివృద్ధికి ఒక నమూనాను రూపొందించినట్లు తెలుస్తున్నది. యాదగిరిగుట్టపై 3 ఎకరాల స్థలమే అందుబాటులో ఉండగా, ఇక్కడ 12 ఎకరాల స్థలం అందుబాటులో ఉండడంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు సమాచారం.
ప్రస్తుతం ప్రధాన ఆలయం పక్కన ఉన్న నిర్మాణాలన్నింటినీ తీసివేసి, ఆ స్థలాన్నంతటినీ ఆలయానికి, అనుబంధంగా నిర్మాణాల కోసం వినియోగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. తీసివేయించిన నిర్మాణాలకు సంబంధించి ఈవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తు ప్రకారం గుట్టపైకి ఈశాన్యం వైపు నుంచి రోడ్డును నిర్మించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక వేళ కొత్త మార్గాన్ని నిర్మించడం వీలుకాకపోతే ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును ఈశాన్యం వైపునకు మళ్లించాలని చూస్తున్నట్టు సమాచారం. గుట్టపై 125 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. స్వామివారి ఆలయ విస్తరణ, అనుబంధ నిర్మాణాలన్నీ కృష్ణ శిలతో చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

సీఎం కేసీఆర్‌తోనే ఆలయాల అభివృద్ధి
చరిత్రలో నిలిచిపోయేలా ఆలయాల పునర్నిర్మాణం ఒక్క సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. ఆయన హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నయ్. యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధికి అడుగులు పడ్డయ్. ఇప్పటికే రూ.వంద కోట్ల నిధులు మంజూరు చేసిండు. అలాగే స్వయంగా వచ్చి పనులను ప్రారంభిస్తానని చెప్పిండు. ఇప్పుడు వస్తున్నడు. నిజంగా సంతోషం. కొండగట్టులో రామకోటి స్తూపం నిర్మాణం అవుతున్నది.
– కొండపలుకుల రామ్మోహన్రావు, జడ్పీటీసీ, మల్యాల
ఆలయానికి మరింత ఖ్యాతి
కొండగట్టు అంజన్న భక్తులకు ఎంతో విశ్వాసమున్నది. అందుకే ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నది. ఆలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలను కల్పిస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుంది. తద్వారా ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయ ఖ్యాతి మరింత పెరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ రాకతో అభివృద్ధికి అడుగు పడుతున్నది. ఇకపై ఆలయం అభివృద్ధి చెందుతుంది.
– జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకుడు (కొండగట్టు దేవస్థానం)
ఇబ్బందులు తొలగుతయ్
నేను ఎన్నో ఏండ్లుగా కొండగట్టు అంజన్న దర్శనం కోసం వస్తున్న. ఎప్పుడు వచ్చినా ఆలయ పరిసరాల్లోనే నిద్ర చేస్త. ఇక్కడ అభివృద్ధి పెద్దగా లేదు. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ రూ.వంద కోట్ల మంజూరు చేసిండు. ఈ నిధులతో ఆలయం అభివృద్ధి చెందుతుంది. తద్వారా వసతులు సమకూరుతయ్. భక్తుల ఇబ్బందులు తొలగుతయ్. మరిన్ని కాటేజీలు అందుబాటులోకి వస్తయ్.
– రాము, ఆంజనేయస్వామి భక్తుడు
మరింత ఆధ్యాత్మికత
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయాల పునర్నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతున్నది. కృష్ణశిలలతో యాదగిరిగుట్ట అద్భుతంగా మారింది. ఇప్పుడు కొండగట్టుకు ప్రత్యేకంగా రూ.100 కోట్లు మంజూరు చేశారు. చేపట్టే పనులను పరిశీలించేందుకు కేసీఆరే స్వయంగా కొండగట్టుకు వస్తున్నారు. ఒక హిందూవాదిగా, ఎన్నో యాగాలు చేసిన చరిత్ర కలిగిన సీఎం నేతృత్వంలో అంజన్న ఆలయం మాస్టర్‌ప్లాన్ రూపొందించడంతో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ఆలయ పరిసర ప్రాంగణంలో మరింత ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
– మిట్టపల్లి లక్ష్మీనారాయణ, ఆధ్యాత్మికవేత్త (మల్యాల)
సీఎం రావడం శుభపరిణామం
కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కొండగట్టు అంజన్న సేవాసమితి పేరిట ఎన్నో ఏళ్లుగా ఉద్యమించినం. గత రెండేళ్లుగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో ప్రతి రోజూ పాల్గొన్నం. కవితక్క నేతృత్వంలో ప్రారంభించిన హనుమాన్‌చాలీసా పారాయణానికి ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి కొండగట్టులో అభివృద్ధి చాయలు కనిపిస్తున్నయ్. ఇటీవల రూ.100 కోట్లు ప్రకటించి, మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం సీఎం కేసీఆరే స్వయంగా రావడం శుభపరిణామం.
– బోగ శ్రీనివాస్, హనుమాన్ చాలీసా పాఠకుడు (కరీంనగర్)