సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 12: గత ప్రభుత్వాలు మోపిన వివిధ రకాల శిస్తు(పన్ను)ను మాఫీ చేసి సుభిక్షమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ విప్లవాత్మకమైన అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగించారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషకరమైన జీవనం సాగించారని తెలిపారు. కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే విధంగా కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. భూమి శిస్తును రద్దు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. గీత కార్మికుల సంక్షేమాన్ని కోరుతూ తాటి, ఈత చెట్లపై పన్ను మాఫీ చేశారని, ఆటో డ్రైవర్ల పన్నును ఎత్తివేశారని గుర్తు చేశారు. మత్స్యకారుల సొసైటీల పన్ను రద్దు చేసి ఉచితంగా చేప పిల్లలను అందించారన్నారు.
నేతన్నలకు యారన్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఉపాధి మార్గాన్ని మెరుగుపరిచారన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపించిన విధంగా కేకే మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. సిరిసిల్లలో నాలుగు రోడ్లు, నాలుగు డివైడర్లు మాత్రమే పనులు జరిగాయని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్‌దేనన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం ద్వారా పచ్చలహారంగా మార్పు చేశారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించామన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రా మానికి వెళ్లినా అభివృద్ధిలో కేటీఆర్ మార్క్ కనిపిస్తున్నదన్నారు. కేకే మహేందర్‌రెడ్డి చేసిన విమర్శలు నిజమైతే ప్రజలు ఆయన్ను ఏనాడో నమ్మేవారని, అక్కున చేర్చుకునేవారన్నారు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా కేకే మహేందర్‌రెడ్డి మనసు మారకపోవడం బాధాకరమన్నారు. ప్ర జలు ఆశీర్వదించిన నాయకుడిని విమర్శిస్తే ప్రజ లు సహించబోరన్నారు. ప్రజల ఆలోచనలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అవసరాలు గుర్తించి వారికి అందుబాటులో ఉండి పని చేస్తామని పేర్కొన్నారు.
మహిళలను అవమానపరచడం సరికాదు: జడ్పీ చైర్పర్సన్ అరుణ
కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నేత కేసీఆర్ అని కొనియాడారు. రైతాంగానికి పెద్దపీట వేసి వ్యవసాయాన్ని పండుగ చే శారని, నేతన్నకు ఉపాధి కల్పించి వారికి అండగా నిలిచారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడంతో పాటు రా ష్ట్రంలో నిరంతర విద్యుత్‌ను అందించారన్నారు. ఆరు గ్యారెంటీల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నింటినీ విజయవంతంగా అమలుచేయాలని సూచించారు. గంభీరావుపేటలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి మహిళలను అవమానపరిచేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలను గౌరవించుకునేది తెలంగాణ సంస్కృతి అని చెప్పారు. సమావేశంలో టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నాయకులు దార్నం లక్ష్మీనారాయణ, కుంబాల మల్లారెడ్డి ఉన్నారు.