పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 4: నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్యనందించడమే కేసీఆర్ సర్కారు అభిమతమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సర్కారు బడుల్లో సకల సౌలతులు కల్పించేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి అంకుర్పారణ చేశారని చెప్పారు. 25.07 లక్షలతో ఆధునీకరించిన పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ దర్గా ప్రభుత్వ పాఠశాలను శనివారం కలెక్టర్ డాక్టర్ సంగీతాసత్యనారాయణ, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి ఆయన పారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠశాల ఆవరణలో కలియదిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో మన ఊరు-మన బడి మొదటి విడుతలో 191 స్కూళ్లను ఎంపిక చేశామని తెలిపారు. రాఘవాపూర్ పాఠశాలను సకల వసతులతో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని పాఠశాలల్లో పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు.
విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యనందించే దిశగా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. సర్కారు బడుల్లో విద్యాప్రమాణాల పెంపునకే తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు తగిన కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ ఆడెపు వెంకటేశం, ఎంపీటీసీ తోట శ్రీనివాస్, జిల్లా సహకార, మండల ప్రత్యేకాధికారి మైకేల్ బోస్, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో ఎం రాజు, ఎంపీవో సుదర్శన్, ఎంఈవో సురేందర్‌కుమార్, ఏఈ పటేల్ మదన్ మోహన్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ సదయ్య, నాయకులు మర్కు లక్ష్మణ్, అంతగిరి కొమురయ్య, ఎనుగుల మల్లయ్య పాల్గొన్నారు.