కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవాలు అంబరాన్నంటేలా, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే మహా సభను విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులను కోరారు. గురువారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవాలపై దిశానిర్దేశం చేశారు. సభ విజయవంతం కోసం ఇప్పటి నుంచే జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని, వరంగల్ సభకు విస్తృత ప్రచారం కల్పించాలని, చలో వరంగల్ పేరుతో వాల్ రైటింగ్ చేయించాలని సూచించారు. సభకు ఉమ్మడి జిల్లా నుంచి 1.75 లక్షల మందిని తరలించాలని, 27న సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటల వరకే చేరుకోవాలని కోరారు. సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ, ఇతర వాహనాలను ముందుగానే సమకూర్చుకోవాలని అన్నారు.
సభకు తరలే ముందు ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. రజతోత్సవ సభ తర్వాత కొత్త సభ్యత్వాలు ఉంటాయని, కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, కమిటీల ఎన్నిక ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ పార్టీ ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదని, హామీల అమలు ఏదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదనే విషయాన్ని ప్రజల్లో చర్చ పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూపొందించిన ‘చలో వరంగల్’ పాటల సీడీని నాయకులతో కలిసి కేసీఆర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్, నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, దావ వసంత, తదితరులు పాల్గొన్నారు.