కరీంనగర్ కార్పొరేషన్, మే 21 : తెలంగాణ గడ్డపై తిరుగులేని పార్టీ బీఆర్ఎస్, మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదుకు సరికొత్తగా ముందుకెళ్తున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతోపాటు ఓటర్ లిస్టు సవరణ, తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ యాప్ ద్వారా చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డిని నియమించగా.. తాజాగా పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించారు.
వీరికి తెలంగాణ భవన్లో డిజిటల్ మెంబర్షిప్ ఎలా నమోదు చేయాలన్న దానిపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జీల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో ఉన్న బూత్‌ల సంఖ్య మేరకు బూత్‌కు ఇద్దరి చొప్పున ఎంపిక చేసి డిజిటల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా కదులుతుండగా, సభ్యత్వ నమోదును పండుగ వాతావరణంలో నిర్వహించి, పార్టీలో కొత్త జోష్ నింపేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.

24