తిమ్మాపూర్, జూన్ 28: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్వారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. పూడిక తీసేందుకు టెండర్ దక్కించుకున్న సంస్థను స్వాధీనం చేసుకొని, ఎల్ఎండీలోని ఇసుకను తోడి రిజర్వాయర్‌ను బొందలగడ్డలా మార్చుతున్నాడని విమర్శించారు. రిజర్వాయర్ పరిధిలో వాగులన్నింటినీ తోడేస్తున్నారని, దీంతో ఎక్కడ చూసినా మట్టి దిబ్బలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానకొండూర్ ప్రజలు ఇసుక, గ్రానైట్ దందాలు చేసేందుకు గెలిపించలేదని.. ప్రజలకు సేవ చేయాలని హితవుపలికారు. కవ్వంపల్లి ఇకనైనా ఇసుక దందా బంద్ చేయాలని.. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని, రోడ్లను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివారం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి వద్ద మోయతుమ్మెద వాగులో ఉన్న ఇసుక క్వారీని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఇసుక తోడిన స్థలాలు, భారీ ఇసుక డంపులను రసమయి పరిశీలించి మాట్లాడారు. ఎప్పుడూ నీటితో కళకళలాడే మోయతుమ్మెద ప్రస్తుతం ఇసుక లేక, నీళ్లు లేక కండ్లకు నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు అంతరించిపోతున్నాయని రైతులు భయాందోళన చెందుతున్నారని, ఇష్టం వచ్చినట్టు ఇసుక తీస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం సిల్ట్ తీసేందుకే అనుమతి ఇస్తే మొత్తం ఇసుకనే తోడేస్తున్నారని విమర్శించారు. కొత్తపల్లి క్వారీలో అక్రమ దందా బయటపడుతుందనే భయంతోనే స్థానికులకు కూలీ పనులు ఇవ్వలేదని మండిపడ్డారు. కొత్తపల్లి ఇసుక క్వారీ మొదట ముంబైకి చెందిన సంస్థ టెండర్ దక్కించుకుందని, తర్వాత మంత్రి ఉత్తమ్ అనుచరులు తీసుకున్నారని, వారిని భారీగా కమీషన్లు డిమాండ్ చేసి ఒత్తిడి చేయడంతో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి చేతిలోకి క్వారీ వచ్చిందన్నారు.
అప్పటి నుంచి అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. సామాన్యుడు ఒక ట్రాక్టర్‌తో ఇసుక తరలిస్తే వెంటనే పట్టుకునే అధికారులు భారీ స్థాయిలో జరుగుతున్న దందాను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. ఈ అక్రమ రవాణా వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు సిద్ధం వేణు, శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, నాయకులు సింగిరెడ్డి స్వామిరెడ్డి, పాశం అశోక్‌రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్, తిరపతి, రమేశ్, మల్లేశం, సదయ్య, తదితరులు పాల్గొన్నారు.