కొత్తపల్లి జూన్ 01: కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి (57) ఆదివారం అకాల మరణం చెందారు. జిల్లా క్రీడా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న రవి ఆదివారం ఉదయం హైదరాబాద్ హైవేలోని కొమురవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలవ్వగా సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. రవికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య గృహిణి కాగా కుమారుడు మైకేల్ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఉమ్మడి జిల్లా అథ్లెటిక్ క్రీడాకారునిగా జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ట్ర క్రీడా పతాకాన్ని రెపరెప లాడించిన రవి నేడు లేరనే వార్త ఉమ్మడి జిల్లా క్రీడారంగాన్ని విషాదంలో ముంచింది.
గతంలో హైదరాబాద్‌లోని జ్ఞాన భారతి, సుమతి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తూ ఎందరో వ్యాయామ విద్య ఉపాధ్యాయులను తీర్చిదిద్దిన ఘనత రవికే దక్కింది. అదే విధంగా ప్రభుత్వ వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా 2002 మే 31న శనిగరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఉద్యోగంలో చేరిన రవి అక్కడి నుంచి దాచారానికి బదిలీ అయ్యారు. అనంతరం 2013లో ఫిజికల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది జమ్మికుంట పాఠశాలలో చేరారు. అక్కడి నుంచి జంగపల్లికి తదనంతరం 317 జీవో ప్రకారం పెద్దపల్లి జడ్పీహెచ్ఎస్ (బాలుర) కు బదిలీపై వెళ్లారు. ఎంతో మంది క్రీడాకారులను జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ది అనేక సంస్థలలో వారు ఉద్యోగాలతో స్థిరపడేలా కృషి చేసిన ఘనత ఆయనే దక్కింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా అథ్లెటిక్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, వ్యాయామ విద్య ఉపాధ్యాయ రిసోర్స్ పర్సన్‌గా కొనసాగుతున్న రవి గతంలో ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శిగా, పెటా సంఘం అధ్యక్షులుగా, రాష్ట్ర పెటా సంఘం భాద్యులుగా వివిధ హోదాల్లో పని చేసి అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
క్రీడా కార్యక్రమాలకు వెళుతూనే..
2000 మిలీనియమ్ వ్యాయామ వృత్తి విద్య కళాశాల హైదరాబాద్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం, జింఖాన గ్రౌండ్స్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ పోటీలకు వెళ్లేందుకు ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి బయల్దేరిన ఆయన ఆ రెండు ఈవెంట్లలో పాల్గొనకముందే అనంతలోకాలకు చేరడం అందరిని కలిచి వేసింది.
పలువురి సంతాపం…
ఫిజికల్ డైరెక్టర్, అథ్లెటిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కడారి రవి మృతితో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడా రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీవైఎస్‌ఓలు శ్రీనివాస్ గౌడ్, సురేశ్, రాందాస్, రవి, ఉమ్మడి జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, ఉపాధ్యాక్షులు తుమ్మల రమేశ్ రెడ్డి, మహ్మద్ కరీం, నాగిరెడ్డి సిద్దారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పీఈటీల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు అంతటి శంకరయ్య, శ్రీనివాస్, బాబు శ్రీనివాస్, ఆడేపు శ్రీనివాస్, వేల్పుల సురేందర్, దాసరి రమేశ్, అథ్లెటిక్ సంఘం భాద్యులు హరికిషన్, రమేశ్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శులు కొమురోజు శ్రీనివాస్, వేణుగోపాల్ తో పాటు పలు క్రీడా సంఘాల భాద్యులు చల్ల హరిశంకర్, ముస్త్యాల రవీందర్, సీహెచ్ సంపత్ రావు, గిన్నె లక్ష్మణ్, ఎండీ యూనిష్ పాష, వై మహేందర్ రావు, సొల్లు సారయ్య, మిల్కూరి సమ్మిరెడ్డి, వంగపల్లి సూర్యప్రకాశ్, సిలివేరి మహేందర్, కనకం సమ్మయ్య, ఎల్వీ రమణ, బిట్ర శ్రీనివాస్, కొమురోజు కృష్ణ, తదితరులు సంతాపం తెలిపారు.