కరీంనగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతున్నది. తొలి విడుత ఎన్నికల్లో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించారు. నామినేషన్ల స్క్రూటినీ, విత్‌డ్రా తర్వాత మొత్తం 398 సర్పంచ్ స్థానాలకుగానూ 20 స్థానాలు సింగిల్ డిజిట్ నామినేషన్‌తో ఏకగ్రీవం కాగా, మిగిలిన 378 సర్పంచ్ స్థానాలకు 1535 మంది బరిలో నిలిచారు.
అలాగే 1064 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 2591 స్థానాలకు 6024 మంది పోటీలో ఉండనున్నారు. వీరికి గుర్తులను కూడా కేటాయించారు. ఈ నెల 11న మొదటి విడుత పోలింగ్ జరుగనుండగా, అదే రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక పోటీ ఉన్న చోట ప్రచారం హోరెత్తనుండగా, ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చూపుతూ.. తాము చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 పంచాయతీలు, కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవం కాగా, అక్కడ ఎన్నికలు ఉండవని అధికారులు తెలిపారు.
కరీంనగర్ : గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలు
జగిత్యాల : మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలు
పెద్దపల్లి : మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, కాల్వశ్రీరాంపూర్ మండలాలు
సిరిసిల్ల : రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాలు

చొప్పదండి మండలం దేశాయిపేట సర్పంచ్‌గా వడ్లకొండ తిరుమల ఏకగ్రీవం కాగా, అదే గ్రామంలో 8 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. ఇదే మండలంలోని పెద్ద కుర్మపల్లిలో సర్పంచ్‌గా మావురం సుగుణ ఏకగ్రీవం కాగా, మొత్తం 8 వార్డులకు ఐదు ఏకగ్రీవమయ్యాయి. అలాగే కరీంనగర్ రూరల్ మండలంలోని నల్లగుంటపల్లిలో ఎనిమిది వార్డులూ ఏకగ్రీవమయ్యాయి. ఈ గ్రామంలో ఒక్క సర్పంచ్ స్థానానికే ఎన్నిక జరుగనున్నది. అలాగే రామడుగు మండలం శ్రీరాములపల్లి సర్పంచ్‌గా ఒంటెల సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రుద్రంగి మండలంలోని గైదిగుట్ట, అడ్డ బోరు, చింతామణి, వీరునితండా, బడితండా, రూప్లా నాయక్, సర్పంచ్ తండాలు.. కోనరావుపేట మండలంలోని కమ్మరిపేట, ఊరుతండా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించరు.
మంథని మండలం తోటగోపయ్యపల్లి సర్పంచ్‌గా దొబ్బల రమేశ్ ఏకగ్రీవం కాగా, మొత్తం ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అలాగే నాగారం సర్పంచ్‌గా బెల్లంకొండ శ్రీదేవి, మైదుపల్లి సర్పంచ్‌గా పంతంగి లక్ష్మణ్, రామగిరి మండలం చందనాపూర్ సర్పంచ్‌గా కొండ మంజుల ఏకగ్రీవయ్యారు.
మెట్పల్లి మండలం చింతలపేట్ సర్పంచ్‌గా తొట్ల చిన్నయ్య, ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ సర్పంచ్‌గా కానుగంటి లాస్య ఏకగ్రీవయ్యారు. యామాపూర్ సర్పంచ్‌గా కనుక నగేశ్, కథలాపూర్ మండలం రాజరాంతండా సర్పంచ్ భూక్యా తిరుపతి ఏకగ్రీవంగా నిలిచారు.
