భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత ఖమ్మంలో మొదటి భారీ బహిరంగ సభ.. ఉదయం నుంచే అంతటా ఉత్కంఠ.. అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారు? ఉజ్వల భారత్ కోసం ఏం చేయబోతున్నారు? ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు? అనే దానిపై ఆసక్తి.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ.. అందుకే ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ప్రజలు ఎక్కడ చూసినా టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోయారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపూ శ్రద్ధగా విన్నారు. దేశంలోని వనరులు, నీళ్లు, కరెంట్ వినియోగంపై వివరించిన తీరును ఆసక్తిగా గమనించారు. దేశంలో బీఆర్ఎస్ ఆవశ్యకత గురించి చెబుతున్న సమయంలో చప్పుట్లు కొడుతూ స్వాగతించారు.
కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖమ్మం గడ్డపై బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత మొదటి సభ కావడంతో గులాబీ శ్రేణులతోపాటు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు సభకు హాజరయ్యారు. ఇదే సమయంలో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. సభకు ఎంత మంది జనం వస్తారు? వక్తలు ఏం మాట్లాడుతారు? అనే విషయాల కోసం అన్ని వర్గాల ప్రజలు ఉదయం నుంచే ఆసక్తిగా ఎదురు చూశారు. ఎక్కడ చూసినా ఈ సభ గురించే చర్చించారు. సభకు అశేషంగా వచ్చిన జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్కు ఇది విజయసంకేతమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం నుంచి టీవీలతోపాటు సెల్ఫోన్లకు అతుక్కుపోయారు. సభ లైవ్ వస్తున్నంత సేపు షాపులు, హోటళ్లు ఇలా ఎక్కడికక్కడ వీక్షించారు. ప్రముఖుల ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు. అరగంటకుపైగా సాగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని మరింత ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్, బీజేపీ చేసిందేమిటి? దేశంలో జరుగుతున్నదేమిటి? అసలు భారతదేశ లక్ష్యం ఏమిటీ? సహజ వనరులు పుష్కలంగా ఉన్నా నీళ్లు, కరెంట్‌కు గోస ఎందుకు? ఇంత సంపద ఉన్న దేశంలో రైతులు ఎందుకు దగా పడుతున్నారు? దేశంలో బీఆర్ఎస్ ఎందుకు రావాలి? ఇలా ఎన్నో అంశాలను సీఎం కేసీఆర్ అర్థమయ్యేలా వివరించగా, ప్రతి విషయాన్నీ ఆసక్తిగా విన్నారు. అధినేత చెప్పిన ప్రతి మాటనూ స్వాగతించారు. బీఆర్ఎస్ ఉజ్వల భారత్‌కు దారి చూపుతుందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు.
తిమ్మాపూర్ రూరల్: మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి వెళ్తున్న నాయకులు
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఓ ఇంటిలో..
కోరుట్ల : హోటల్లో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని సెల్ఫోన్లలో ఆసక్తిగా వింటున్న ఉత్తరప్రదేశ్ యువకులు