పై ఫొటోలో ఇక్కడ కనిపిస్తున్న మోటర్ల సంఖ్య అక్షరాల నూటొక్కటి.. అయితే, ఇవేమీ ప్రదర్శన కోసం పెట్టినవో.. లేక మెకానిక్ షెడ్డుకు రిపేర్‌కు తెచ్చినవో కాదు.. పొద్దంతా కాలువగట్లు, గోదావరి పరీవాహక ప్రాంతం, మెకానిక్ షెడ్ల వద్ద రెక్కీ చేసి, సాయంత్రం కాగానే పక్కా ప్రణాళిక రూపొందించి కార్లల్లో వచ్చి వీటిని ఎత్తుకెళ్లారు.. ఇలా రెండునెలలుగా వరుస చోరీలతో హడలెత్తిస్తున్న మోటర్ల దొంగలు ఎట్టకేలకు దొరికారు. పెగడపల్లిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటర్లను తరలిస్తున్న ఆరుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన 101 పంప్సెట్లు, స్విఫ్ట్‌కారును స్వాధీనం చేసుకున్నారు.
పెగడపల్లి, జూలై 31 : అంతర్జిల్లా దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో ఆరుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ. 30 లక్షల విలువైన 101 వ్యవసాయ మోటర్లు, స్వీఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ భారీ చోరీ వివరాలను జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. మల్యాల సీఐ డీ రమణమూర్తి, పెగడపల్లి ఎస్ఐ కొక్కుల శ్వేత ఆదివారం పెగడపల్లి నందీ చౌరస్తావద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు కార్లలో మోటర్లు కనిపించడంతో అనుమానం వచ్చి అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విచారించగా మోటర్లను దొంగిలించి తీసుకెళ్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం గాజులపేటకు చెందిన ఇందూరి అలియాస్ అల్లెపు లక్ష్మణ్, రాయికల్ మండలం కొత్తపేటకు చెందిన అలకుంట సంతోష్, నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన గాజమ్ రవి, అలకుంట శ్రీకాంత్, సంపంగి ప్రవీణ్, అలకుంట మహేశ్ ఆరుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలుచోట్ల మోటర్ల దొంగతనాలు చేశారు. ఉదయం వేళల్లో ఎస్సారెస్పీ కాలువలు, గోదావరి ప్రాంతం, మెకానిక్ షెడ్ల వద్ద రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో కార్లల్లో వచ్చి మోటర్లు ఎత్తుకెళ్తారు. వీరు జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలో 4 చోట్ల, రాయికల్ మండలంలో 5, జగిత్యాల రూరల్ మండలంలో 4, మల్యాల మండలంలో 2, సారంగాపూర్‌లో 1, గొల్లపల్లిలో 1, బీర్పూర్లో 1, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో 1 చోట మొత్తంగా 101 మోటర్లు చోరీ చేశారు. రెండు నెలలుగా మోటర్లు ఎత్తుకెళ్తూ మెట్టుపల్లికి చెందిన అల్లెపు లక్ష్మణ్ వద్ద కొన్ని, పెగడపల్లి ఎస్సారెస్పీ కాలువ పక్కన చెట్ల పొదల్లో కొన్ని మోటర్లు దాచి ఉంచారని వివరించారు. పొదల్లో దాచి ఉంచిన మోటర్లను తరలిస్తుండగా పట్టుబడ్డారు. వీరిని సోమవారం రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.