సిరిసిల్ల రూరల్/వేములవాడ రూరల్, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలేదని, లోక్‌సభ ఎన్నికల కోడ్ సాకు తో ఆ పార్టీ డ్రామాలకు కుట్ర చేస్తున్నదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం తంగళ్లపల్లిలో చేపట్టిన ప్రజాహిత సంగ్రామ యాత్రలో, వేములవాడ మండలం మారుపాక నందికమాన్ వద్ద మాట్లాడారు.
కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 70రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించినోళ్లు, అయో ధ్య అక్షింతలపై రాజకీయం చేసేటోళ్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోసారి మోదీని ప్రధానిగా చేద్దామన్నారు. ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నియోజకవర్గ ఇన్చార్జి రాణీరుద్రమ, మండలాధ్యక్షుడు శ్రీధర్‌రావు ఉన్నారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రారంభించారు. రూ.10లక్షల నిధులు కేటాయించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రంగు శ్యాం ఎంపీకి వినతి పత్రం అందించారు. ఇక్కడ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, వైస్ ఎంపీపీ జం గిటి అంజయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, నాయకులు గజభీంకార్ రాజన్న, జాల్గం ప్రవీణ్, బుస్స వేణు, కోడి అంతయ్య, పడిగెల రాజు, పెద్దూరి తిరుపతి, అంకారపు రవీందర్, మాట్ల మధు ఉన్నారు.