కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వ డం మాని, యూరియా బస్తాలు ఇవ్వాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడమో, రాజకీయం చేసేందుకో, పోలీసులను ఇబ్బంది పెట్టేందుకు రాలేదని తెలిపారు. తాము ప్రజల కోసం ముందుంటామని, ప్రజలు ఏది కోరితే దానికి కట్టుబడి పని చేస్తామని స్పష్టం చేశారు.
కరీంనగర్ శివారులో దుర్శేడ్లో రాజీవ్హ్రదారిపై రైతులు రాస్తారోకో చేయగా, గంగుల మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఇదే బీజేపీ ప్రభుత్వం ఉందని అప్పుడు ఒక్క రైతు కూడా రోడ్డు పైకి రాలేదని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ప్రణాళిక, ఆలోచన, రైతుల సమస్యలపై అవగాహనతో ముందుగా యూరియా స్టాక్ తెచ్చి పంపిణీ చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక చేయలేక రైతుల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన గుర్తుకు వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత ఏర్పడిందన్నారు. సాగు పనుల్లో ఉండే రైతులు.. చెప్పులు, రాళ్లు పెట్టుకుని దుకాణాలు, సొసైటీ కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ దుస్థితిని తీసుకువచ్చాయని ఆగ్రహించారు.
వరి పొట్ట దశలో ఉందని, ఈ పది రోజుల్లో యూరియా, పొటాషియం తప్పక అందించాలని, ఇవ్వకపోతే వరిగింజ లేక తాలు వచ్చి పంట నాశనమవుతుందని, రైతులు తీవ్రంగా నష్ట పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు ఎక్కడో ఉండి ప్రకటనలు చేయడం కాదని, స్థానికంగా వాస్తవాలు తెలుసుకుని చేయాలని, గ్రామానికి గ్రామం రోడ్డెక్కి బతుకమ్మ ఆడే పరిస్థితి ఎందుకు వచ్చిందని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం కాదని, రెండు ప్రభుత్వాలు రైతుల కోసం పని చేయాలని హితవుపలికారు. ఎరువుల సరఫరాలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. రైతులకు ఇంత ఇబ్బందవుతున్నా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజల మధ్యలో కనిపించడం లేదని, బయట ఉండి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.
యూరియాను బాక్ల్ మార్కెట్లో 450కు అమ్ముకుంటున్నారని, అధికారులు గోదాంలలో ఉన్న బస్తాలను తీసుకువచ్చి రైతులకు అందించాలని సూచించారు. రైతులకు పంట నష్టం జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దుర్శేడ్ సొసైటీకి 350 బస్తాలు మాత్రమే వచ్చాయని, 500 మంది రైతులు చెప్పులు, పాసుపుస్తకాలు పెట్టి ఉదయం నుంచి క్యూలో ఉన్నారని, అందరికీ బస్తా దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల్లో రైతులకు యూరియా కొరత తీర్చాలని, లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ చేసినా ఆపేది లేదని, ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.