కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 4 : ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించాలన్న ఆలోచనతోనే అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక ఫిల్టర్‌బెడ్‌లో 147 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పనులను సోమవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1.34 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు అందించడంతోపాటు 1.02 లక్షల మురుగునీటి కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.
అమృత్-2 పథకంలో 2.99 లక్షల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణకు అమృత్ 1, 2 కింద 6876 కోట్లను అందించామన్నారు. నగరాభివృద్ధికి సహకరిస్తామని, రాజకీయాల కంటే అభివృద్ధే ముఖ్యమని, ఎన్నికల వరకే రాజకీయాలు మాట్లాడాలని సూచించారు. పగలు, పంతాలకు పోతే అభివృద్ధి చేయలేమని పేర్కొన్నారు. అతి త్వరలో కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను టెంపుల్ సర్యూట్ పరిధిలోకి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్‌లోని టీటీడీ దేవాలయ నిర్మాణం కోసం టీటీడీ చైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు.
రోజూ నీటి సరఫరా జరిగే ఏకైక నగరం
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
రాష్ట్రంలో ప్రతి రోజూ మంచినీటి సరఫరా జరిగే ఏకైన నగరం కరీంనగర్ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. అన్ని పార్టీలు పాల్గొంటున్న కార్యక్రమం ఇదేనని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఎన్ని ఉన్నా ప్రజా సేవ కోసం, అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే తాము పని చేస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో నగరంలో 24 గంటలపాటు మంచినీటి సరఫరా చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగామన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ప్రతి రోజూ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. అమృత్ కింద చేపడుతున్న పనులతో విలీన గ్రామాల్లోనూ ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేసే అవకాశం ఉంటుందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను కేంద్రంలోని టూరిజం విభాగంలో పూర్తి చేసే బాధ్యతను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీసుకోవాలని కోరారు. ఇది పూర్తయితే నగరానికి పర్యాటక శోభ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.