సిరిసిల్ల/ముస్తాబాద్, జూన్ 15 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. సుమారు ఐదున్నర గంటల పాటు పర్యటించిన ఆయన ఆరు గ్రామాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రసంగించారు. ఉదయం 11:57 గంటలకు ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లికి చేరుకున్న ఆయన ముందుగా రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు.
మధ్యాహ్నం 1:05 గంటలకు ముస్తాబాద్‌లో ఎంపీపీ జనగామ శరత్‌రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి, వారినుద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి 1:40 గంటలకు చీకోడులో సీసీ కెమెరాలు, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. మధ్యాహ్నం 3:05 గంటలకు గూడెంలోని పీఏసీఎస్ అధ్వర్యంలో నిర్మించిన వాణిజ్యసముదాయ భవనాలను ప్రారంభించారు. 3:45 గంటలకు సేవాలాల్ తండాలోని జగదాంబ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్నారు. 4:25 గంటలకు పోతుగల్లోని శ్రీ సీతారామాలయ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 5:10 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.