దళిత బంధు యూనిట్లు ప్రారంభం
జమ్మికుంట, జూన్ 8: దళిత బంధు పథకంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబం యూనిట్లను నెలకొల్పుకొని ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. జమ్మికుంట పట్టణంలో దళిత బంధు లబ్ధిదారుడు చోటు మొబైల్ షాపును ఏర్పాటు చేసుకోగా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి ప్రారంభించి, లబ్ధిదారుడిని సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. లబ్ధిదారులకు మొదటి విడుత రూ.5లక్షలు అందజేస్తున్నామని తెలిపారు. యూనిట్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని అందిస్తున్నామని చెప్పారు. అనంతరం పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. పాలకవర్గం, కమిషనర్ పనితీరును మెచ్చుకున్నారు. వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు వెంటనే మంజూరు చేసి, రెవెన్యూ పెంచాలని కమిషనర్ సమ్మయ్యకు సూచించారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు గొప్ప పథకమని ఎస్సీ క్పారేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన కలెక్టర్‌తో కలిసి దళిత బంధు యూనిట్‌ను ప్రారంభించి, మాట్లాడారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి యూనిట్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు ఉన్నారు.
యూనిట్లపై సమగ్ర సర్వే
హుజూరాబాద్ టౌన్, జూన్8: హుజూరాబాద్‌లో క్లస్టర్ , జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో మంజూరైన యూనిట్లను ఆడిట్ అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ పరిశీలించారు. బిల్లులు, ఇన్వాయిస్, మెటీరియల్‌ను ఆడిట్ చేశారు. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. హుజూరాబాద్ డివిజన్లో దళిత బంధు పథకం కింద లబ్ధిదారులు కొనుగోలు చేసిన యూనిట్లను అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఇక్కడ బిల్ కలెక్టర్ బండ మోహన్ తదితరులు ఉన్నారు.
ఆర్థిక స్వావలంబనకు దోహదం
శంకరపట్నం, జూన్ 8: ఆర్థిక స్వావలంబనకు దళితబంధు పథకం ఎంతగానో దోహద పడుతుందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన సంధ్యకు దళితబంధు పథకం కింద ఎంబ్రాయిడింగ్, టైలరింగ్ యూనిట్ మంజూరు కాగా మండల కేంద్రంలో నెలకొల్పారు. ఈ యూనిట్‌ను బుధవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక ప్రారంభించారు. ఎంబ్రాయిడింగ్ యంత్రం పనితీరును పరిశీలించారు. ఇక్కడ సర్పంచ్ బండారి స్వప్న తదితరులు ఉన్నారు.
యూనిట్లను ఎంపిక చేసుకోవాలి..
వీణవంక, జూన్ 8: అర్హత కలిగిన యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ కర్ణన్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన దాసారపు రజిత-శ్యామ్‌కు దళితబంధు యూనిట్ (కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్సీస్ సెంటర్) మంజూరు కాగా జడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులతో మాట్లాడి అభినందించారు. జడ్పీ సీఈవో ప్రియాంక పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలు, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామాలను పరిశీలించారు. తహసీల్దార్ సరిత, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, ఆర్ఐ ప్రవీణ్, ఏవో గణేశ్, పంచాయతీరాజ్ ఏఈ రాంబాబు, సర్పంచులు పంజాల అనూష-సతీశ్, పోతుల నర్సయ్య, మాజీ ఎంపీటీసీ తాండ్ర శంకర్, నాయకులు ప్రకాశ్, తిరుపతి, రాజయ్య, శ్రీనివాస్, సురేశ్ ఉన్నారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి..
ఇల్లందకుంట జూన్ 8: దళితబంధుతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ కర్ణన్ సూచించారు. మండల కేంద్రంలో వీణవంక మండలం కొండపాకకు చెందిన సావడమల్ల రమాశ్రీధర్ దళిత బంధు కింద టీమాల్ను ఏర్పాటు చేసుకోగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలసి ప్రారంభించారు. ఇక్కడ మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ ఉన్నారు.