‘తెలంగాణ ఒకప్పుడు పూర్తి వివక్షకు గురైంది. సమైక్యపాలకుల చిన్నచూపుతో అభివృద్ధి, సంక్షేమంలో వెనుకబడ్డది. కానీ ఈ రోజు సీఎం కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తున్న తెలంగాణను చూసి కేంద్రం కడుపు మండుతున్నది. అభివృద్ధికి అడ్డంపడుతున్నది. వ్యవసాయం బాగుపడితే బాగుంటే ఓర్వడం లేదు. నల్లచట్టాలు తెచ్చి ఇబ్బంది పెట్టాలని చూసింది. మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నది. ఎన్ని చేసినా మీకు కేసీఆర్ ఉన్నడు. అండగా నిలబడ్డడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ 40 ఏండ్ల పాలనలో చేసిందేమీ లేదు. కానీ టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలోనే ఊహించని అభివృద్ధి చేసుకున్నం. ఇక బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకొంటున్నరు కదా.. నేనొక్కటే ప్రశ్నిస్తున్నా.. తెలంగాణలాంటి పథకాలు వాళ్లు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? చెప్పాలి.
– అబ్బాపూర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్
జూలపల్లి, జూన్: అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణను చూసి కేంద్రం కడుపు మండుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణపై పూర్తి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను ఆందోళనకు గురి చేసిందనీ, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారని గుర్తుచేశారు. భవిష్యత్‌లో కేసీఆర్‌కు ప్రజలు మద్దతు పలికి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం అబ్బాపూర్‌లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కలిసి ఐదో విడుత ‘పల్లె ప్రగతి’లో పాల్గొని, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసి, మాట్లాడారు. పల్లెల్లో వెలుగులు నింపేందుకు అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, సీఎం ఆలోచన విధానాలతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేస్తే గ్రామాలు మరింత ఆదర్శంగా మారతాయని చెప్పారు. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల, డయాలిస్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని వివరించారు. కాంగ్రెస్ 40 ఏండ్ల పాలనలో అభివృద్ధి జాడ లేదని, 8 ఏండ్ల టీఆర్ఎస్ పాలనలో ఎవరూ ఊహించని అభివృద్ధిని సాధించుకున్నామన్నారు. బీజేపీ నాయకులు గొప్పలు మాట్లాడుతున్నారని, వారి పాలిత రాష్ర్టాల్లో మిషన్ భగీరథ, నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలు అమలవుతున్నాయా.. చెప్పాలని ప్రశ్నించారు. సీఎంఆర్ఎఫ్ అభాగ్యులకు వరంగా మారుతున్నదని, అబ్భాపూర్ గ్రామస్తులు అత్యధికంగా వైద్య ఖర్చులు పొంది మొదటి స్థానంలో నిలువడం ఆనందంగా ఉందని చెప్పారు.
అభివృద్ధి పనుల ప్రారంభం
అబ్భాపూర్లో రూ 22 లక్షల నిధులతో నిర్మించిన రైతు వేదిక భవనం, పద్మశాలీ, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూ. 19.20 లక్షలతో సామాజిక భవనాలు, రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, వీధుల్లో హైమాస్ట్ లైట్లు మంత్రి ఈశ్వర్ ప్రారంభించారు. ఆ తర్వాత కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బీరప్ప కల్యాణోత్సవాలకు హాజరై, దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మంత్రిని సన్మానించారు.
భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కా వాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలునిచ్చారు. కార్యక్రమంతో గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు జరిగాయని, ప్ర జల ఆరోగ్యం మెరుగుపడి, వ్యాధులు తగ్గిపోయానని చెప్పారు. ఇక నుంచి వార్డు సభ్యులు వారివారి వార్డుల బాధ్యత తీసుకొని పారిశు ధ్యం నిర్వహణపై శ్రద్ధ చూపాలని సూచించారు.
అమాత్యుడికి వినతుల వెల్లువ
గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ ఈర్ల మల్లేశం, గ్రామస్తులు మంత్రి ఈశ్వర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్నకొండ నుంచి అబ్భాపూర్ వయా పెద్దపల్లి దాకా డబుల్ రోడ్డు నిర్మించాలని కోరారు. ధర్మారం నుంచి సుల్తానాబాద్ దాకా బస్సు సౌకర్యం కల్పించాలని, గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేయాలని, జూలపల్లి ప్రభుత్వ దవాఖానలో విలీనం చేయాలని కోరారు. అలాగే ఈ ప్రాంతం నుంచి వేములవాడకు బస్సు వేయాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి స్పందించారు. రైతు వేదిక నుంచి పెర్కపల్లె రోడ్డు అభివృద్ధి చేస్తానని, అంతర్గత రోడ్లు పూర్తి చేయించి మిగులు పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, సర్పంచులు ఈర్ల మల్లేశం, మేచినేని సంతోశ్‌రావు, దారబోయిన నరసింహం, ఎంపీటీసీ సభ్యులు దండె వెంకటేశం, తమ్మడవేని మల్లేశం, పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ పసునూటి శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి రంగారెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఇన్చార్జి తహసీల్దార్ అబుబాకర్, ఎంఈవో కవిత, ఏవో ప్రత్యూష, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు విశారపు వెంకటేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాంతయ్య, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.