సంగారెడ్డి ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనున్నది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలోని 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, కోహీర్, ఇస్నాపూర్, ఇద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల కోసం సోమవారం ఉద యం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. మొదట కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
మెజార్టీ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి..
జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలు బీఆర్ఎస్కు దక్కనున్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు బలం ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలతోపాటు జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకుంటామని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గుమ్మడిదల, ఇంద్రే శం, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు అవసరమైన కౌన్సిలర్ల బలం బీఆర్ఎస్కు సొంతంగా ఉంది. దీంతో నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ నాయకత్వం ధీమాగా ఉంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ వద్ద ఉన్నారు. కాంగ్రెస్ క్యాంపులోని కౌన్సిలర్లు గొడవ పడుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ శిబిరంలోని అనైక్యత బీఆర్ఎస్కు కలిసివచ్చే అవకాశం ఉంది. జహీరాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు అధిక మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు, ఎంఐఎం మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతుండటంతోపాటు కౌన్సిలర్లలో గ్రూపు విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర, ఇతర కౌన్సిలర్ల మద్దతుతో జహీరాబాద్ చైర్మన్ పీఠం దక్కించుకుంటామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, కోహీర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నందున ఆ పార్టీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కే అవకాశం ఉంది.
అందరి దృష్టి ఎక్స్అఫీషియో ఓట్లపైనే
జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు అంతా క్యాంపుల్లోనే ఉన్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు తమ నుంచి చేజారిపోకుండా ప్రధాన రాజకీయపార్టీలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర కౌన్సిలర్లు పక్కపార్టీ క్యాంపుల్లోకి గుట్టుచప్పుడుకాకుండా జారుకుంటున్నట్లు సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యే,ఎంపీ,ఎమ్మెల్సీల ఓట్లు కీలకంగా మారనున్నాయి. దీంతో ఎక్స్అఫీషియో సభ్యులు ఎటు ఓట్లు వేస్తారోనని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.