పాపన్నపేట, ఫిబ్రవరి 15: శివనామస్మరణలతో ఏడుపాయల మార్మోగింది. ఏడుపాయలుగా ప్రవహించే మంజీరానదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఉపవాసదీక్షలు ప్రారంభించారు.ఆదివారం తెల్లవారు జామున ఆలయ అర్చకులు మూలవిరాట్ వనదుర్గ అమ్మవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరించి ఏడుపాయల్లో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. మూడు రోజులు జరిగే జాతరను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దంపతులు,అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రారంభించారు.వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది భక్తులు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏడుపాయలకు చేరుకున్నారు.
మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు చేసి శివరాత్రి ఉపవాస దీక్షలు చేపట్టారు.చాలామంది ఉపవాస దీక్షలు చేపట్టాలనే ఉద్దేశంతో శనివారం రాత్రే ఏడుపాయలకు చేరుకోగా మరికొంత మంది తెల్లవారు జామున చేరుకున్నారు.ఉదయం నుంచి గంట గంటకూ ఏడుపాయలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.పోతంశెట్టిపల్లి వైపు నుంచి వచ్చిన భక్తులు రెండో బ్రిడ్జి వద్ద పార్కింగ్ ప్రదేశంలో తమ వాహనాలు నిలిపి కిలోమీటర్ నడుచుకుంటూ ఏడుపాయలకు చేరుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, జహీరాబాద్,నారాయణఖేడ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నాగ్సాన్పల్లి వైపు ఏడుపాయల కమాన్ మీదుగా ఏడుపాయలకు చేరుకున్నారు.నాగ్సాన్పల్లి వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు చెల్మెలకుంట వద్ద పోలీసులు నిలిపివేయడంతో కొంత మేర ఇబ్బందులు పడ్డారు.
ఆలయానికి చేరుకోవడానికి కిలోమీటరు నడవాల్సి రావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూడు రోజుల పాటు ఏడుపాయల్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏడుపాయల్లో మొదటి రోజు భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి మరుసటి రోజు బండ్లు తిరిగే కార్యక్రమంలో పాల్గొని రథోత్సవం ముగిశాక తమ ఇండ్లకు తిరిగి ప్రయాణమవుతారు. హైదరాబాద్ నుంచి పోతంశెట్టిపల్లి వైపు నుంచి బస్సుల్లో వచ్చే భక్తుల కోసం ఏడుపాయల వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. ఏడుపాయల పరిసర ప్రాంతాల్లోని వివిధ గ్రామాల ప్రజలు ఏడుపాయలకు భారీగా తరలి వచ్చారు. ఆనకట్టపై ప్రమాదాలు జరగకుండా దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి దారిని మూసివేశారు.
ఏడుపాయల వన దుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
ప్రత్యేక భద్రత జాతరను మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షించారు. ఉదయం నుంచే మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కొనసాగుతుంది. ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు జాతర పరిసర ప్రాం తాల్లో పర్యవేక్షణ చేస్తూ భక్తుల భద్రతను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
పకడ్బందీ ఏర్పాట్లు
ఏడుపాయల జాతరకు సుమారు పది లక్షలకు పైచీలుకు భక్తులు రానున్నారన్న అంచనాలతో సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వనదుర్గా ప్రాజెక్టుకు విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఘనపురం ఆనకట్ట,అమ్మవారి ఆలయం,చెక్‌డ్యామ్ తదితర ప్రాంతాల్లో షవర్ల వద్ద స్నానాలు ఆచరించారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా నల్లాలతో పాటు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు. నీరు కలుషితం కాకుండా సంబంధిత వైద్య సిబ్బంది ఘనపురం ఆనకట్ట, చెక్‌డ్యామ్ తదితర ప్రాంతాల్లో క్లోరినేషన్ చేశారు. జాతరకు వచ్చే భక్తులకు అనుగుణంగా మరుగుదొడ్లతో పాటు బయో టాయిలెట్స్ సైతం ఏర్పాటు చేశారు. జాతరలో విద్యుత్ అంతరాయం కలుగకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.