హుజూరాబాద్ టౌన్, జూన్ 4: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలతో నాణ్యమైన విద్యనందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉపాధ్యాయులు కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పట్టణంలోని పలు చోట్ల ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు అర్చన, జవహర్ అవస్తి, భీటవరం శ్రీలత, జమున మామిడ్లవాడలో పిల్లల తల్లిదండ్రులను కలిశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కాలేరు శశికళ పట్టణంలోని డిపో క్రాస్ రోడ్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఊరుకొండ సత్యప్రసాద్, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మారెట్ ఏరియాలో ప్రచారం చేశారు. ఇంటింటా ప్రచారానికి పలుచోట్ల తల్లిదండ్రుల నుంచి చకని స్పందన వచ్చిందని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలిపారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, జూన్ 4: బడీడు పిల్లలను తప్పనిసరి గా బడిలో చేర్పించాలని ఎంపీటీసీ విజయాకుమార్ కోరారు. బడిబాటలో భాగంగా శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనతోపాటు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హెచ్ఎం డీ పాన్యానాయక్, ఎస్ఎంసీ చైర్పర్సన్ శ్యామల, ఉపాధ్యాయులు సంపత్, వీరస్వామి, మల్లయ్య, మారుతిరావు, ప్రమీల, శారద తదితరులు పాల్గొన్నారు.