West Bengal : పశ్చిమ బెంగాల్లో ఒక బూత్ లెవల్ ఆఫీసర్ దారుణానికి పాల్పడ్డాడు. తనతో వివాహేతర సంబంధం కలిగిన ఒక మహిళ భర్తను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్, నార్త్ 24 పరగణాల జిల్లాలో రిజ్వాన్ హసన్ మోండల్ అనే వ్యక్తి బీఎల్వోగా పని చేస్తున్నాడు. అతడికి పెళ్లైన ఒక మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.
అయితే, తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఆమె భర్తను చంపాలని రిజ్వాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత సోమవారం ఆమె భర్త నాజిర్ అలీ (30)కి ఫోన్ చేశాడు. రాష్ట్రంలో జరుగుతున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గురించి కొన్ని విషయాలు మాట్లాడాలంటూ అతడిని రహస్యంగా ఒక ప్రదేశానికి రమ్మని చెప్పాడు. ఇది నమ్మిన నాజిర్ అలీ సోమవారం సాయంత్రం అతడు చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడ రిజ్వాన్ హసన్, అతడి స్నేహితుడు సాగర్ గైనె అనే మరో వ్యక్తి కలిసి నాజీర్‌ను హత్య చేశారు. అంతేకాదు.. అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి స్థానిక కాలువసహా అనేక చోట్ల పడేశారు. ఇదే సమయంలో నాజిర్ సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదని అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సెల్‌ఫోన్ కాల్స్, లొకేషన్స్ వంటి వివరాలు పరిశీలించగా రిజ్వాన్‌పై అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. సోమవారం రిజ్వాన్‌ను హత్య చేయగా, శుక్రవారం అతడి శరీర భాగాలు బడూరియా పరిధిలోని కాలువలో లభించాయి. పోలీసులు నిందితులు రిజ్వాన్‌తోపాటు అతడికి సహకరించిన సాగర్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటనతో అతడి బంధువులు, స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ అంశంపై పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.