జమ్మికుంట రూరల్, జూన్ 4: మండలంలోని గండ్రపల్లి గ్రామంలో భూలక్ష్మీ, మహాలక్ష్మీ సహిత బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు పురోహితులు వల్లూరి పవన్‌కుమార్, గణేశ్ బృందం ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం గ్రామంలో శోభాయాత్రను నిర్వహించారు. దేవతా మూర్తులకు జలాధివాసం జరుపగా, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.. కార్యక్రమంలో సర్పంచ్ బల్మూరి పద్మాసమ్మారావు, ఎంపీటీసీ తోట కవితాలక్ష్మణ్, తనుగుల పీఏసీఎస్ చైర్మన్ పొల్సాని వెంకటేశ్వర్రావు, అడ్తీదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్ తిరుపతిరావు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బత్తుల పాండుతో పాటు వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సైదాపూర్‌లో..
సైదాపూర్, జూన్ 4: మండలకేంద్రంలోని సైదాపూర్‌లో రేణుకా ఎల్లమ్మ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అర్చకులు కూర్మాచలం శరత్, కూర్మాచలం సంతోష్ ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ స్థాపితం, జయాధిహోమం, గ్రామభూత బలి ప్రదానం తదితర ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రేణుకా ఎల్లమ్మ దేవస్థానం అధ్యక్షుడు అనగోని వీరన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సింగాపూర్‌లో..
హుజూరాబాద్ రూరల్, జూన్ 4: మండలంలోని సింగాపూర్ గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవం చివరి రోజు శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, వొడితల వంశస్తులు శ్రీనివాస్‌రావు, కిషన్‌రావు, ప్రణవ్‌బాబు, పవన్‌కుమార్, కౌశిక్, కపిల్, రిషిత్, అభిరామ్‌తో పాటు పలువురు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.