రాష్ట్ర అవతరణోత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. గురువారం ఆద్యంతం పండుగ వాతావరణంలో కొనసాగాయి. ఊరూరా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. జిల్లాకేంద్రంలో వేడుకలు కనుల పండువను తలపించగా, పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
కరీంనగర్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అవతరణ సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి. గురువారం ఊరూరా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో పతాకావిష్కరణలు చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఆయాచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో సంబురాలు హోరెత్తాయి. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు, తదితరులతో కలిసి తెలంగాణ అమరుల స్తూపం వద్ద పూలుచల్లి నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రగతి సందేశాన్ని వినిపించారు. అనంతరం 18 మంది తెలంగాణ అమర వీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన 17 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా బాల భవన్, పారమిత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తర్వాత పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన తేనీటి విందును స్వీకరించారు.