హుజూరాబాద్, సెప్టెంబర్ 4: ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు అండగా ఉండండి.. మీ ప్రాంత అభివృద్ధికి జిమ్మేదారు మాది’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఉద్ఘాటించారు. కొందరు ఓట్ల కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారని.. కానీ తమ పనితనాన్ని చేతల్లో చూపుతున్నామని ప్రకటించారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులకు నిధులిచ్చామని గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో మహిళా సంఘాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, ఇప్పటికే ఒక సంఘానికి 20గుంటలు కేటాయించామన్నారు. త్వరలోనే నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తామని చెప్పా రు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్‌చైర్‌పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కళ్లెపల్లి రమాదేవి, ప్రతాప మంజుల కోరిక మేరకు మరో మూడు సంఘాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, ఇందుకు తానే బాధ్యత తీసుకుంటున్నానని మంత్రి చెప్పారు. పట్టణంలోని బీఎస్సార్ గార్డెన్స్‌లో శనివారం మహిళా సంఘాల సభ్యులకు రూ.1.25 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
కల్యాణలక్ష్మి దండుగన్నడు..
ఆడబిడ్డలు తల్లిదండ్రులకు బరువు కావద్దనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో రూ.50వేలతో ప్రారంభమైన పథకాన్ని ఇప్పుడు ఏకంగా లక్షా నూట పదహారు రూపాయలకు పెంచిన మహానుభావుడు కేసీఆర్ అన్నారు. ఈ స్కీం ప్రారంభ సమయంలో పెళ్లి కూతురు ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేసేదని, కానీ.. పెంచిపోషించిన తల్లిదండ్రులకు మేలు చేయాలనే తలంపుతో పెళ్లికూతురు తల్లి పేరిట చెక్కులు అందిస్తున్నామని చెప్పారు. ఇలాంటి మంచి స్కీంను అమలు చేస్తుంటే ఓర్వలేని ఈటల.. కల్యాణలక్ష్మిని దండుగ అని మాట్లాడడం హాస్వాస్పదమన్నారు. పథకాలను పరిగెతో పోల్చి ప్రజలను అవమానించారని దుయ్యబట్టారు. పేదల భూములు గుంజుకొని పెద్దపెద్ద బంగళాలు కట్టుకున్న ఈటలకు ఈ పథకాల విలువ ఏం తెలుస్తుందని నిలదీశారు. సానుభూతి కోసం వెంపర్లాడేవారిని నమ్మవద్దని.. ఆలోచించి ఓటేయాలని కోరారు. నరంలేని నాలుక ఎట్లయినా మాట్లాడుతుందని దెప్పిపొడిచారు. కులమతాలకతీతంగా పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు మెరుగైన వైద్యమందించే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశామన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటినీ అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు.
ఇండ్ల గురించి అడిగితే కోపమెందుకు?
తెలంగాణలో కేసీఆర్ మంత్రులందరితో పాటు ఈటలకు 4వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారని, కానీ ఆయన ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. తామంతా దర్జాగా పేదలకు ఇండ్లు పంచామని, మరి ఎందుకు ఇవ్వలేదని ఈటలను అడిగితే ఆయకు కోపం వస్తుందన్నారు. కల్యాణలక్ష్మికి ఓటేస్తారా? ఈటల గోడ గడియారానికి ఓటేస్తారా? అని అడిగితే ఆయన ఎగిసిపడడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఏడేండ్ల మంత్రి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. ఉన్న ముచ్చట చెబితే తనను ఇష్టమొచ్చినట్లుగా తిడుతున్నాడని మండిపడ్డారు. ధర్మం, ఆత్మగౌరవం అంటూ నిత్యం వల్లించే ఆయన తనపై నిందలు మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆ యన పనిచేయలేదు.. అందుకే అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని అంటే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ‘నేను మాట్లాడిన దాం ట్లో ఏమైనా బూతు పదాలున్నాయా? లేని ముచ్చట్లు చెప్పితినా? అని ప్రశ్నించారు. ఈటలకు ఓట్లపై ఉన్న ధ్యాస ప్రజల సంక్షేమంపై లేదని నిప్పులు చెరిగారు. జాగ ఉన్నవారికి డబుల్బెడ్రూం కోసం రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. రాజేందర్ చేయలేని పనులను చేసి చూపిస్తామని ఘంటాపథంగా పేర్కొన్నారు.
ఏ గల్లీలో చూసినా ఇరుకురోడ్లే..
హుజూరాబాద్‌లో ఏ గల్లీలో చూసినా ఇరుకు రోడ్లు, అపరిశుభ్రమైన డ్రైనేజీలు కనిపిస్తున్నాయని తెలిపారు. వీటి అభివృద్ధికి ప్రభుత్వం రూ. 35 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో 13 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కిలోమీటరు మేరు పూర్తి చేశామని చెప్పారు. అధ్వానంగా ఉన్న సైదాపూర్-బోర్నపల్లి రోడ్డు అభివృద్ధికి రూ.6కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. నిధులు సరిపోకుంటే టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డి, కాబోయే ఎమ్మెల్యే గెల్లు శ్రీనివాస్ నిధుల్లోంచి కేటాయిస్తామని చెప్పారు.
అక్కాచెల్లెళ్లు ఆలోచించండి..
‘అక్కాచెల్లెళ్లు మంచి చెడూ ఆలోచించండి.. బీజేపీ నేతల మాటలు నమ్మి ఆగం కావద్దు.. ఏ తొవ్వలో పోతే పనైతదో? జర ఆలోచించండి ’అని మహిళలను కోరారు. వేరేవాళ్లకు మద్దతిచ్చి మమ్మల్ని బాధ్యత తీసుకోమంటే ఎట్లా? దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పితికితే రావని, పనిచేసేవాళ్లకే ఓటేయాలని అభ్యర్థించారు. ‘రూ.2 వేల పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు అన్నీ కండ్ల ముందే కనబడుతున్నాయి.. విజ్ఞతతో వ్యవహరించండి’ అని కోరారు. ‘ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇచ్చిన ప్రతిమాటను నెరవేర్చే బాధ్యత నాది’ అంటూ పునరుద్ఘాటించారు. బీజేపీకి ఓటేస్తే వచ్చేదేంలేదని, వారి మాయమాటలను నమ్మవద్దని సూచించారు. కాగా, మంత్రి హరీశ్‌రావును మహిళలు ఘనంగా సన్మానించారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కౌన్సిలర్లు కేసీరెడ్డి లావణ్య, దండ శోభ తదితరులున్నారు.
అక్కా.. బాగున్నారా..
హుజూరాబాద్, సెప్టెంబర్ 4: పట్టణంలోని బీఎస్సార్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన మహిళా సంఘాల సమావేశానికి హాజరైన మంత్రి హరీశ్‌రావు మహిళలతో ముచ్చటించారు. సమావేశానికి వెళ్లే దారి కిక్కిరిసిపోవడంతో రోడ్డుపైనే తన కాన్వాయ్‌ను నిలిపి కాలినడకన సమావేశానికి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు మహిళలతో మాట కలిపి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
మహిళలతో మంత్రి సంభాషణ ఇలా..
హరీశ్‌రావు: అక్కా బాగున్నరా… ?
మహిళలు: (మంత్రిని చూసి మహిళలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు) ఆ సారూ.. బాగున్నం.
హరీశ్‌రావు: ఏమనుకుంటున్నరు ఎలక్షన్ల గురించి?
మహిళలు: అనుకునేది ఏమున్నది సారూ… అందరు కేసీఆర్ సార్కే వేద్దాం అంటున్నరు.
హరీశ్‌రావు: కేసీఆర్‌ది ఏం గుర్తో తెలుసా..?
మహిళలు: మాకు తెలువదా సారూ… మీరు గమ్మతు చేస్తున్నరు. ఎప్పటి నుంచో కారు గుర్తుకే ఓటు ఏయబడితిమి.
హరీశ్‌రావు: మరి బీజేపోళ్లు ఏమంటుండ్రు..?
మహిళలు: వాళ్లు అనేది ఏమున్నది సారూ.. ఇప్పుడే ఇటు వస్తంటే గ్యాస్ మొద్దు వచ్చింది. రూ.950 తీసుకుండ్రు. గంత పిరం చేస్తున్న గాళ్ల గురించి మాట్లాడుకోవడం దండుగ.
హరీశ్‌రావు: అయితే అట్లంటున్నరా… అక్కా..?
మహిళలు: గంతే సారూ.. గ్యాస్, పెట్రోల్, మంచినూనె ధరలు మస్త్ పెరిగినయ్. గా బీజేపోళ్లకు ఓటు వేసేది లేదు.
హరీశ్‌రావు: కేసీఆర్ మంచి పనులు చేస్తున్నట్లే కదా..?
మహిళలు: గందుకే గదా సారూ… కేసీఆర్‌కు ఓట్లేత్తన్నం. గిప్పుడు కూడా ఆయన నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేస్తం.
హరీశ్‌రావు: సరే అక్కా… మీటింగ్ కోసం మన అక్కలు ఎదురు చూస్తున్నట్లు ఉన్నరు.. నేను వెళ్లొస్త..
మహిళలు: సరే సారూ… మీరు వెళ్లండి..
గతంలో అభివృద్ధి జరగలే..
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఈటలను అడిగితే పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు మంచిగ లేరని, నిధులు లేవని కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నడు. మరీ హరీశన్న ఎట్ల కట్టించిండో ఈటల సమాధానం చెప్పాలె.
గెల్లు శ్రీనుకు ఓటు వేయాలి
ఎవరు గెలిస్తే అభివృద్ధి అవుతదో మహిళలు ఆలోచించాలి. గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేస్తేనే పనులు జరుగుతాయి. ఇక్కడ మహిళలకు సంఘా భవనాల్లేక చెట్ల కిందనే మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చేది. ఈ దుస్థితి పోవాలంటే కేసీఆర్ సార్ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలి.
నమ్మితే ముంచిండు..
ఐదేళ్లు ఉండమని అధికారం ఇస్తే మధ్యలోనే ఈటల రాజేందర్ రాజీనామా చేసిండు. ఆయనను నమ్మితే నిండా ముంచిండు. ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గెల్లు శ్రీనివాస్ ఒక వ్యక్తి కాదని, ఆయన వెనుక ఒక పెద్ద వ్యవస్థే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.