జమ్మికుంట, సెప్టెంబర్ 4: కేంద్రం అమలు చేస్తున్నది పస లేని పథకాలని, తెలంగాణ ప్రభుత్వం లాంటి ఒక్క మంచి పథకం తేలేదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రధాని మోదీ దేశాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో ఆయన గౌడ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.20లక్షల నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ ప్రతిని వారికి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. బీజేపీ అబద్దాల పుట్ట అని, అందులో చేరిన ఈటల రాజేందర్ కూడా అబద్దాలనే నమ్ముకుని ప్రజల ముందుకు వస్తున్నాడని విమర్శించారు. ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఆశీర్వదించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రొసీడింగ్ పత్రాలు అందజేత
మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో రూ.15 లక్షలతో మహిళా సంఘం, రూ.15లక్షలతో అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు సంబంధించి ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నరేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆయా సంఘాల నాయకులకు అందజేశారు. తెలంగాణ సర్కారు అందిస్తున్న పథకాలను పరిగె అంటున్న ఈటల రాజేందర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఈటల నిర్లక్ష్యం చేసిండు: ఎమ్మెల్యే నన్నపునేని
ఆరుసార్లు గెలిచి, ఏడేళ్లు మంత్రి పదవిని అనుభవించిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిండని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆరోపించారు. ఈటల పార్టీని వీడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. టీఆర్ఎస్తోనే ఉంటామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని ధర్మారం ప్రజలంతా ప్రతిజ్ఞ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి
తాను హాస్టల్లో ఉండి చదువుకున్నానని, తెలంగాణ ఉద్యమంలో గౌడ మిత్రులతో కలిసి జైలు జీవితం గడిపానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామరక్ష అని చెప్పారు. ‘మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే.. మీ బిడ్డగా సేవ చేస్తా’ అని విజ్ఞప్తి చేశారు.
100మంది టీఆర్ఎస్లో చేరిక..
ధర్మారానికి చెందిన 100మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, హనుమాన్ యూత్ సభ్యులు మంత్రి కొప్పుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరినవారికి మంత్రి, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ అర్బన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం నాయకులు, యువకులు, ధర్మారం ప్రజలు పాల్గొన్నారు.
సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి పూజలు
ఇల్లందకుంట రూరల్, సెప్టెంబర్ 4: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు దర్శించుకున్నారు. మంత్రి వెంట జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఈవో సుధాకర్, ఉప సర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు పొడేటి రామస్వామి, కోటి, వెంకటేశ్, రవీందర్, అర్చకులు వంశీధరశర్మ, రామయ్యశర్మ, సీతారామశర్మ తదితరులున్నారు.
టీఆర్ఎస్కు అడ్తిదారులు, గుమస్తాలు
జమ్మికుంట, సెప్టెంబర్ 4: జమ్మికుంట మున్సిపల్లోని అడ్తిదారుల సంఘం, గుమస్తాల సంఘాలు టీఆర్ఎస్కు జై కొట్టాయి. ఆయా సంఘాల సభ్యులు పట్టణంలో శనివారం ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ ప్రతిని మంత్రి కొప్పుల ఈశ్వర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు అందజేశారు. టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సమష్టిగా పనిచేస్తామని ప్రతినబూనారు. కాగా, ఇటీవల మంత్రి కొప్పుల అడ్తిదారుల, గుమస్తా సంఘాలకు కొత్త భవనాలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, చెరో రూ.10 లక్షల నిధులు మంజూరు చేసి, ఆ ప్రతులను సంఘాల నాయకులకు అందించారు. తర్వాత ఆయా సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.