చౌటుప్పల్, ఫిబ్రవరి 16 : చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మోదుగాల పావని రమేశ్ గౌడ్, వైస్ చైర్మన్‌గా గోసిక వినయ్ ఎన్నికయ్యారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు కౌన్సిలర్ సభ్యులు పాల్గొన్నారు. ఈ క్రమంలో చైర్మన్‌గా మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్‌గా గోసిక వినయ్ ను ఎన్నుకున్నారు.
చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో రచ్చ రచ్చ అయింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కు ఇవ్వాలని ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ల క్యాంప్ కాన్వాయ్‌ని ఆమె అత్త, మాజీ ఎంపీటీసీ బత్తుల వరలక్ష్మి, మరికొంతమంది ఆమె కుటుంబ సభ్యులు కలిసి అడ్డగించారు. దీంతో వాణి ఒక్కసారిగా కాన్వాయ్ నుంచి కిందకు దూకి ప్రజల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె మద్దతుదారులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బత్తుల వాణి విప్లవ్ ను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. స్థానికురాలైన బత్తుల వాణి విప్లవ్ ను కాదని, స్థానికేతరురాలైన మోగుదాల పావని రమేష్ గౌడ్ కు చైర్మన్ పదవి ఇస్తున్నారని మండిపడ్డారు.

చౌటుప్పల్ చైర్‌పర్సన్‌గా మోదుగాల పావని రమేశ్ గౌడ్
గతంలో కూడా స్థానికేతరుడుకే చైర్మన్ పదవి ఇస్తే అభివృద్ధి చేసింది ఏం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతరులకు ఇవ్వొద్దని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 25 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌కు పని చేస్తున్నామని అయినా ఎవరిని పట్టించుకోకుండా స్థానికేతరునికి చైర్మన్ ఇచ్చారని దుమ్మెత్తి పోశారు. అంతేకాకుండా మరికొంతమంది కార్యకర్తలు రెండు పదవులు బీసీలకే ఇవ్వడం దారుణం అన్నారు. జనరల్ స్థానంలో చైర్మన్ ను బీసీకి ఇవ్వడమే కాకుండా, వైస్ చైర్మన్ పదవిని కూడా బీసీకి కేటాయించడంపై మిగతా వర్గాలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిగించారు.

చౌటుప్పల్ చైర్‌పర్సన్‌గా మోదుగాల పావని రమేశ్ గౌడ్