రాజన్న సిరిసిల్ల, మే 3 (నమస్తే తెలంగాణ): ఆది నుంచీ నేతన్నను కడుపులో పెట్టి చూసుకుంటున్న, సర్కారు ఆపత్కాలంలో ఆదుకునేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నాటి ప్రభుత్వాల తీరుతో కనీస రక్షణ లేకుండా పోయిన జీవితాలకు మంత్రి కేటీఆర్ చొరవతో కొండంత భరోసానిచ్చేందుకు సిద్ధమైంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చారిత్రక పథకం ‘రైతు బీమా’ తరహాలో కుటుంబాలకు ధీమానిచ్చేందుకు ‘నేతన్న బీమా’ను అమల్లోకి తెస్తున్నది. ప్రభుత్వమే యేటా ప్రీమియం చెల్లిస్తూ, కార్మికుడు మృతిచెందితే కుటుంబం రోడ్డున పడకుండా ఏకమొత్తంలో 5లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఉమ్మడి జిల్లాలో 15వేల మందికి ప్రయోజనం కలుగనున్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాలు వస్త్ర పరిశ్రమకు పెను భారంగా మారింది. నూలుపై, వస్త్ర ఉత్పత్తులపై వేస్తున్న జీఎస్టీతో పన్నులతో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. కార్మికుడినే యజమానిగా మార్చే వర్కర్టూ ఓనర్ పథకాన్ని తీసుకొచ్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. తాజాగా రైతు బీమా తరహా అనుకోని పరిస్థితుల్లో కార్మికుడు మృతిచెందితే కుటుంబం రోడ్డున పడకుండా ఏక మొత్తం లో 5లక్షలు అందజేసేందుకు ‘నేతన్న బీమా’ను తీసుకువచ్చింది. పథకం కోసం రూ.29.98 కోట్లు కేటాయిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.
మాట నిలుపుకున్న కేసీఆర్..
నేతన్నకు బీమా సౌకర్యం కల్పిస్తానంటూ సీఎం కేసీఆర్ గతేడాది జూలై 4న సిరిసిల్లలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సమావేశంలో మాట్లాడుతూ నేత కార్మికుల నాటి దయనీయ పరిస్థితులను గుర్తు చేశారు. రైతుల మాదిరి ‘నేతన్న బీమా’ ప్రవేశపెడుతామని హామీ ఇచ్చి, నెరవేర్చుకున్నారు. రాష్ట్రంలోని 55,072 మంది కార్మికులకు వ్యక్తిగత బీమా కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపునకు రూ.29.98 కోట్లను కేటాయిస్తూ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేసింది. సాంచాల పనిలో రిటైర్మెంట్ అంటూ లేని నేతన్నకు రూ.5లక్షల బీమా సౌక ర్యం కల్పించిన పెద్దన్నకు రుణపడి ఉంటామని కార్మిక కుటుంబాలు కొనియాడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 15వేల మందికి లబ్ధి..
‘నేతన్నబీమా’ పథకంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 15వేల మందికి లబ్ధి చేకూరనున్నది. ఇందు లో 10వేల మంది కార్మికులు సిరిసిల్ల జిల్లాలోనే ఉన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికులతో పాటు అనుబంధ పరిశ్రమలైన డైయింగ్, వార్పిన్, సైజింగ్, వైపనీ, తదితర పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులందరికీ వర్తించేలా చేనేత జౌళీశాఖ చర్యలు తీసుకుంటున్నది. ప్రతి కార్మికుడికి రూ. 2,271.50 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనున్నది. 15వేల మందికి బీమా కింద ఏటా రూ.3,40,72,500 కోట్ల భారం ప్రభుత్వంపై పడనున్నది. మరమగ్గాలు, అనుబంధ పరిశ్రమలను జియోట్యాగింగ్ చేసి, కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయగా, వాటి ఆధారంగా బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగిన వారంతా పథకానికి అర్హులు.
మాది రామడుగు మండలం గుండిగోపాల్రావుపేట. నాకు నలభై ఆరేళ్లుంటయ్. నేత కుటుంబంలో పుట్టిన నాకు భార్య లక్ష్మి, కొడుకులు వాసు డిగ్రీ, విక్రమ్ పదో తరగతి చదువుతున్నరు. వాళ్లు పుట్టగానే ఉపాధి చూసుకునేందుకు 2009లో సిరిసిల్లకు వచ్చిసాంచాలు నడిపిద్దామనుకున్నా. సావుకేకలు చూసి భయపడి మహారాష్ట్రలోని భీవండికి పోయిన. అక్కడ పొట్టకు తింటూ సాంచాలు నడిపినా కుటుంబాన్ని సాదలేకపోయిన. తెలంగాణ సర్కారు వచ్చినంక సాంచాల సప్పుళ్లు జోరయినయ్. కేటీఆర్ సార్ దయవల్ల బతుకమ్మ చీరల పుణ్యమా అని మళ్ల సిరిసిల్లకు వచ్చి పార్కులో ఇళ్లు కిరాయికి తీసుకుని భార్య పిల్లలతో కలిసి ఉంటున్న. చేతినిండా పని, పనికి తగ్గ కూలీ వత్తుంది. ఇపుడు బీమా నింపేందుకు పైసల్లేని మాకు ఎల్ఐసీ కట్టిస్తుండన్న వార్త నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఇక్కడి సర్కారు ఆదుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు. కేసీఆర్, కేటీఆర్ ఉన్నన్ని రోజులు మాకు రందిలేదు.