మానేరు నదిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది. నిధులు మంజూరైనా పనులు ప్రారంభించడంలో సర్కారు అలసత్వం చూపుతున్నది. మరోవైపు బోటు షికారు చేయాలన్న పర్యాటకుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఫలితంగా మా‘నీటి’ అందాలకు పర్యాటక శోభ సంతరించుకోవడం కలగానే మిగులుతుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతున్నది.

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల మెట్ట ప్రాంతం. ప్రాజెక్టులు.. నీళ్లు లేక పంటల సాగుపై అన్నదాతల ఆశలు సన్నగిల్లాయి. ఉన్న ఒక్కగానొక్క ఎగువ మానేరు వరదలపైనే ఆధారపడింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పెద్ద వాగు పేగు ఎండి భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. అలాంటి పరిస్థితిలో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మధ్యమానేరుకు గోదావరి జలాలు వచ్చి సిరిసిల్ల మానేరుకు ఎదురెక్కి గంగమ్మ ఒడికి చేరాయి. గోదావరి అందాలను పరవశింపజేస్తూ రామప్ప గుట్టలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
దశాబ్ధాలుగా ఎండిన పెద్ద వాగు నిండుకుండలా కోనసీమను తలపించింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలితంగా మానేరు నది ఏడాది పొడవునా జలశోభ సంతరించుకుంటున్నది. అంతే కాకుండా, భూగర్భజలాలను పెం చి సాగుకు జీవం పోసింది. అలాంటి మానేరును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మానేరు బ్రిడ్జి కి కుడి, ఎడుమ వైపులా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపట్టారు.
ఇందులో ఎడమ వైపు రామప్ప బ్రిడ్జి వరకు, కుడివైపున బతుకమ్మ ఘాట్, అంబ భవానీ, సాయిబాబా ఆలయాల వరకు సుమారు 80 ఫీట్ల వెడల్పుతో గత ప్రభుత్వ హయాంలో కరకట్ట పనులు చేపట్టారు. ప్రేమ్‌నగర్ నుంచి మొదలుకొని సాయిబాబా ఆలయం వరకు మీటరు ఎత్తు వరకు మట్టి రోడ్డు వేశారు. మానేరు ఒడ్డున రామప్ప గుట్టల సమీపంలో రిసార్టులు, వివిధ పార్కులు, బోటు షికారు, ట్రెక్కింగ్ లాంటివి పర్యాటక కేంద్రంలో భాగంగా ఏర్పాటు చేయాలని అంచనా వేశారు. నభూతో నభవిష్యత్ అన్న చందంగా పర్యాటక ప్రాంతం సందర్శకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు.. ప్రభుత్వం మారడంతో కాగితాలకే పరిమితమయ్యాయి.

నిధులున్నా చేపట్టని పనులు
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ మాదిరిగా మానేరుకు పర్యాటకు శోభను తెచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేయించారు. 80 ఫీట్ల వెడల్పు కరకట్టపై పార్కులు, సైక్లింగ్, యోగా సెంటర్లు, విశాఖ బీచ్‌ను తలదన్నేలా మానేరును తీర్చి దిద్దాలని సంకల్పించారు. మానేరుకు నెక్లెస్‌లా ఇరువైపులా రోడ్లు నిర్మించి సిరిసిల్ల ప్రజలకే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వీకెండ్ స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు.
అయితే, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పర్యాటకం పత్తాలేకుండా పోయింది. ఇరిగేషన్, మున్సిపాల్టీలు సంయుక్తంగా చేపట్టిన పర్యాటక రంగానికి గ్రహణం పట్టింది. ఇటీవలే రూ.25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. వాగులో పోసిన మట్టి కాస్తా కొట్టుకుపోయింది. సాయిబాబా ఆలయం వరకు వేసిన రోడ్డు కనుమరుగైంది. వచ్చిన సర్కారు పనులు ప్రారంభిస్తుందా లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు పర్యాటక ప్రాంతాన్ని చూస్తామా? అన్న అనుమానాలు సిరిసిల్ల ప్రజల్లో వ్యక్త మవుతున్నాయి. జలవిహారం కోసం ఏర్పాటు చేసిన బోట్లు అలంకార ప్రాయమయ్యాయి. రామప్ప గుట్ట వద్ద ప్రదర్శనకు పెట్టారు. ప్రస్తుతం మానేరు నిండా నీళ్లుండగా, బోటు షికారును ప్రారంభిస్తారన్న ఆశతో ప్రజలు ఎదిరి చూస్తున్నారు.
పనులు ప్రారంభిస్తాం
కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కొన్ని అంచనాలతో ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రావాల్సి ఉన్నది. ప్రస్తుతం చెరువులన్నీ నీటితో నిండినందున మట్టి తీయడం సాధ్యం కాదు. వచ్చే వేసవిలో పనులు ప్రారంభిస్తాం.
– కిశోర్‌కుమార్, నీటిపారుదల శాఖ ఈఈ (సిరిసిల్ల )