వేములవాడ రూరల్, నవంబర్ 9: ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థుల మృతి చెందారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ వీధికి చెందిన గడికందుల మణిచరణ్(18), రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడుకు చెందిన బూర శశికుమార్(18) వేములవాడ మండలం అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
ఆదివారం సాయంత్రం మణిచరణ్ తన స్నేహితుడి ద్విచక్ర వాహనంపై అగ్రహారం నుంచి రగుడుకు వెళ్లాడు. శశికుమార్‌కు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తిరిగి అగ్రహారం బయలుదేరాడు. ఈ క్రమంలో అగ్రహారం శివారులోని మూలమలుపు వద్ద వీరి ద్విచక్ర వాహనం అదుపు తప్పి మర్రి చెట్టును అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మణిచరణ్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలైన శిశికుమార్ కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘటనా స్థలాన్ని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్ఐ రామ్మెహన్ పరిశీలించారు. మృతదేహాలను వేములవాడ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.