గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పల్లెప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే పట్టణ స్థాయి వసతులు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద సైదాపూర్ మండలానికి రూ.కోటీ 90 లక్షల నిధులు మంజూరు కాగా, అంతర్గత రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతున్నది.
– సైదాపూర్, మార్చి 12
సైదాపూర్ మండలంలోని చాలా గ్రామాల్లో అంతర్గత రహదారులు సరిగా లేక వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వానకాలం బురదమయమై రాకపోకలకు అసౌకర్యం కలుగుతున్నది. ప్రభుత్వం దశలవారీగా సీసీరోడ్ల నిర్మాణం కోసం నిధులు ఇస్తుండడంతో క్రమంగా పరిస్థితి మెరుగు పడుతున్నది. తాజాగా మండలంలోని 26 గ్రామాలకు రూ. కోటీ 90లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటితో ఆయా గ్రామాల్లో సీసీరోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. అంతర్గత రహదారుల నిర్మాణాలకు ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా, మట్టి రోడ్లతో దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి గ్రామానికి రూ. 20లక్షలు మంజూరు చేయడంతో అంతర్గత సీసీరోడ్ల నిర్మాణం చేపట్టాం. త్వరలోనే పనులు పూర్తవుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
– తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, సర్పంచ్ దుద్దనపల్లి
సైదాపూర్ మండలానికి రూ. కోటీ 90లక్షల నిధుల మంజూరుకు కృషి చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎమ్మెల్యే నేతృత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణంతో దశాబ్దాల కాలంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి.
– సోమారపు రాజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
గతంలో అంతర్గత రహదారులు వానకాలం బురదమయమై నడువాలంటే ఇబ్బందిగా ఉండేది. సీసీ రోడ్డు పోయడం వల్ల ఇక బురద సమస్య ఉండదు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు కేటాయిస్తున్నది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ నేతృత్వంలో గ్రామాలు ప్రగతి పథంలో సాగుతున్నాయి.
– పోతిరెడ్డి హరీశ్‌రావు, దుద్దనపల్లి ఉప సర్పంచ్