కార్పొరేషన్/కొత్తపల్లి, డిసెంబర్ 12: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీదారుల నుంచి 177 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తారని, అధికారులు ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చి వెనువెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి 7, మున్సిపల్ కార్యాలయానికి 24, జిల్లా విద్యాధికారి కార్యాలయానికి 4, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 9, ఆర్డీవో కార్యాలయానికి 5, జిల్లా సంక్షేమాధికారి 5, కరీంనగర్ రూరల్ తహసీల్ కార్యాలయానికి 5, కొత్తపల్లి తహసీల్ కార్యాలయానికి 13, మిగిలిన శాఖలకు 105 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కలెక్టరేట్ ఏవో నారాయణస్వామి, అధికారులు పాల్గొన్నారు.