కార్పొరేషన్/కలెక్టరేట్, డిసెంబర్ 12: జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆయన అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మండల విద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులతో మన ఊరు-మన బడి, తొలిమెట్టు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజం అభివృద్ధిలో విద్య ప్రధాన పాత్రను పోషిస్తుందని, విద్యా విధానాన్ని మెరుగుపరుచడంలో అధికారులు నిరంతర కృషి చేయాలని సూచించారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 30 పాఠశాలల్లో పునరుద్ధరణ పనులను త్వరగా చేపట్టి, ఈనెల 20వ తేదీలోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే ఇంజినీరింగ్ అధికారులు బిల్లులను ఎఫ్టీవోలో నమోదు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో వంట గది, మూత్రశాలలు, ప్రహరీ, డైనింగ్ హాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.
రాత్రింబవళ్లు పనులు చేయించి స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రారంభించేలా చూడాలన్నారు. పనులను అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని సూచించారు. పునరుద్ధరణ అనంతరం ఉన్న చెత్తా చెదారం, పాఠశాలలో పనికిరాని వస్తువులను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. పాఠశాలల అభివృద్ధితో పాటు పునరుద్ధరణ అనంతరం ఎదురయ్యే సమస్యలను పరిషరించేందుకు ఎస్ఎన్సీ రివాల్వింగ్ నిధులను కూడా మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కోతుల బెడద అధికంగా ఉన్న చోట గ్రిల్స్ ఏర్పాటు చేయించాలని, పాఠశాలలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేకాధికారులు ఎఫ్ఎల్ఎన్ విధానంపై ప్రతివారం సమీక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో కార్యక్రమం అమలు తీరును పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఇంజినీరింగ్, నోడల్ అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.